Take me home, country roads!

 

1

మెత్తని అరచెయ్యి

నీ కొలరాడొ నది.

దీని నిదానమయిన నడకల్లోంచి

నా వూరి గుండె గూళ్ళలోకి

పిచ్చుకలాగా జారిపోయాను సుఖంగా.

బ్రైస్, నీ లాగే నవ్వుతోంది

మీ వూళ్ళో నీ కొలరాడొ.

2

మా వూరెలా వుందో గుర్తు లేదు

అన్నీ విడిచి వచ్చిన వివస్త్ర ఆత్మ.

వొంటి మీది తెల్ల వస్త్రం నా మనసుని  విప్పదు.

 

నీ భాషలోకి వొదిగిపొయాను

నేనూ, నా అన్ని వుద్వేగాలతో

ఆవేశాలతో.

 

3

ఈ పూట నీ వూళ్లో

నీ కొలరాడొ చీర మడతల్లో

కరిగిపోయాను ఆత్మని మడత పెట్టి.

నిన్ను కన్న నీ వూరికి ధన్యవాదాలు, బ్రైస్

నీ పసి చిరునవ్వుల వెన్నెల్లో

ఆడుకున్న కొలరాడొ తీరమ్మీది బాతులన్నిటినీ

పేరు పేరునా అడిగానని చెప్పు.

నీ లేత పాదాల కేరింతలతో

మార్మోగిన నీ చిన్నిసాకర్ స్టేడియంని

తలుచుకున్నాననీ చెప్పు.

 

స్కూలు బస్సు వెనకాతల కూర్చొని

వూళ్ళోని వొకే వొక్క ఆ గోధుమ రంగు అమ్మాయితో

నీ గుసగుసలన్నీ ఇప్పటికీ వినిపిస్తున్నాయనీ చెప్పు.

దారి పొడవునా

ఆకుపచ్చని తలలూపిన

వూరూరూ పలవరించాననీ చెప్పు.

4

నీ వూపిరి చప్పుళ్ల కూని రాగం తీస్తూ వచ్చాను వెనక్కి.

నీ ఆటలూ అలకలూ

నీ పాటలూ కలతలూ

నీ నడకలూ అలుపులూ అన్నీ నావి ఇంక.

ఇంతా చేస్తే

నెమ్మదిగా పరిగెత్తే నీ నదిలో

ఇప్పటికీ నా కాళ్లు సగం అలాగే వుండిపోయాయి

తడి ఆరకుండా.

 

(మిత్రుడు, విద్యార్థి బ్రైస్ తో అతని వూరు బాస్ట్రాప్ లో కలిసి గడిపిన క్షణాల కలవరింత)

 

ప్రచురితం: on ఫిబ్రవరి 10, 2009 at 2:58 పూర్వాహ్నం అభిప్రాయములు (1 )

ఈ టపాని ట్రాకుబ్యాకు చెయ్యడానికి URI: http://afsar2008.wordpress.com/2009/02/10/take-me-home-country-roads/trackback/

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్

ఒక కామెంటు Leave a comment.

  1. బ్లాగు లోకానికి స్వాగతం. ఇక మంచి కవిత్వం , మంచి సాహిత్యం చదివే అవకాశం లభించబోతున్నదన్న మాట.
    శుభాకాంక్షలు!
    దార్ల


Leave a Comment