డెడ్ లైన్

 

DEADLINE1-6-09-11640

 

జాఫ్నా 2009: నేల ఇంకో సారి

చిగురుటాకులా కంపించింది

ఆకాశదేహమంతా అవనత పతాకం.  

జల జల రాలుతున్న ధీర శరీరాల  శిధిల పత్రాల్లోంచి

 నిక్షిప్త సూర్యుళ్ళ కళ్లు

నాలుగు దిక్కుల మీద  మంటల భుజాలు .

మరణంతో ముగిసే చరిత్ర కాదు

శాసనాలతో రాలే ఆయుధాలు కాదు

నిప్పుల వూపిరినెవ్వరూ వురికంబం ఎక్కించలేరు.

నేల ఇంకోసారి కంపించింది.

ఆకాశం కాళిక  రుధిర నాలుక

సూర్యుడి నిశ్శబ్దం వాటికి అలవాటే!

 

 తెలంగాణా 2009 : దగాపడిన నేల

ఇంకోసారి నిట్టుర్చింది దీర్ఘంగా.

ఇంత మోసాన్ని ఇంత కడుపు కోతని

ఇంత నిలువెత్తు దగాని

ఏ కడుపులో దాచుకోవాల?

కొన్ని అలవాటయిన మరణాలు, ఆత్మ హత్యలు, భ్రూణ హత్యలు

వంచనలు.. గాయపడి నెత్తురోడుతున్న నమ్మకాలు.

దళారీల పాలపుంత నా తెలంగాణా.

వీరుల త్యాగఫలాలన్నీ కుళ్లిపోయాయి,

1948… 1969….2009 చేదు గుర్తులు. ఎండని పుండ్లు.

నేను కన్న కల బ్యాలట్ పెట్టెలో వొక వికృత శిశువు.

ఈ మరణానికి నిర్వచనం లేదు.

ప్రతి మెలకువ వొక ఎండమావి.

*

కొన్ని మరణాలు రెండు క్షణాల మౌనాలు

సాయంత్రపు దిగులు గుడారాల్లో సేదతీర్చే ఒంటెలు

కాసేపటి విషాదం తరవాత గతంలోకీ జారిపోయే జ్నాపకాల పుటలు

రేప్పొద్ధుటి బానిసత్వానికి తెరుచుకునే దేహాలు

కొన్ని మరణాలు తద్దినాలు

ఏడాదికోసారి ఏడ్పించే ఆనవాలు

కాసేపట్లో నాటకం ఎలాగూ అంతమవుతుంది

ఇక ఇంటికి వెళ్లిపోతాం కదా

వెక్కి వెక్కి ఏడ్పులు  

వొక పూటకి ఆవిరయిపోయే వడగాడ్పులు

*

కొన్ని మరణాలు నాలుగు జన్మల వెయ్యి జననాల కేరింతలు

కాలాన్ని పరిగెత్తించే అగ్నిరధచక్రాలు

కలల్ని నేలమీదికి ప్రవహించే జ్వాలా జలపాతాలు

కన్నీరయి పారిపోని నిప్పు గుండాలు

అలిసిపోని అలావా తొక్కిళ్లు.

*

నేల ముద్దిడే వీరుడి నెత్తుటి బొట్టు

తూర్పు శరీరమ్మీద  నిలబడే జండా తల

వొక కల…..ఎప్పటికీనా?

ప్రచురితం: on జూన్ 1, 2009 at 2:08 అపరాహ్నం అభిప్రాయములు (1 )

ఈ టపాని ట్రాకుబ్యాకు చెయ్యడానికి URI: http://afsar2008.wordpress.com/2009/06/01/%e0%b0%a1%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%88%e0%b0%a8%e0%b1%8d/trackback/

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్

ఒక కామెంటు Leave a comment.

  1. హ్మ్ భారంగా ఉన్నాయి.


Leave a Comment