మంచి కవిత్వం – రిల్కే ఉత్తరాలు

కట్టల కొద్దీ కవిత్వం పంపీ పంపీ చివరకి సహనం కట్టలు తెగిపోయి, ఓ రోజున విశ్వనాథ ముందు రెక్కలు కట్టుకుని వాలాడు శిష్యకవి. “గురువు గారూ, నా పద్యాలు మీకు నచ్చలేదా? ఏమైనా తప్పులునాయా?” అని సవినయంగా అడిగాడు.దానికి విశ్వనాథ “తప్పుల గురించి నాకు బెంగ లేదు కాని, ఇందులో ఒప్పులేమైనా తగలడ్డాయా అని వెతుకుతున్నాను” అన్నారట. సరిగ్గా – జర్మన్ మహాకవి రిల్కే (1875-1926) కూడా అలాంటి సన్నివేశంలోనే ఇరుకున్నాడు ఇరువయ్యో శతాబ్దికి అటూ ఇటూగా.

ఒక యువకవి పదే పదే పంపిస్తున్న కవిత్వానికి ఏం జవాబివ్వాలో తెలియక, సతమతమై, చివరకి ఆ కవికి వుత్తరాలు రాయటం మొదలు పెట్టాడు రిల్కే. అలా అతను రాసిన పది వుత్తరాలు “లెటర్స్ టు ఎయంగ్ పోయెట్” అనే శీర్షికన పుస్తకంగా అచ్చయి, ఆ యువకవిని సాహిత్య చరిత్రకి ఎక్కించాయి. ఇప్పటికీ ఈ ఉత్తరాలు కొత్త కవులకి మరచిపోలేని కాన్క. ఒక్కో వుత్తరంలో వొక ముఖ్యమైన విషయాన్ని తీసుకుని, ఆత్మీయంగా వివరించాడు రిల్కే. నూరేళ్ళ కిందటి ఈ వుత్తరాలు నిజంగా అప్పటికంటే ఇప్పుడే మరీ అవసరమనిపిస్తుంది.

పారిస్
ఫిబ్రవరి 17, 1903

మిత్రుడా,

కొద్ది రోజుల కిందటే నీ వుత్తరం అందింది. నా మీద నీకున్న గొప్ప నమ్మకానికి ధన్యవాదాలు. అంతకంటే నేను చెయ్యగలిగిందీ, చెప్పగలిగిందీ ఏమి లేదు మరి! నీ పద్యాల్ని చర్చించే శక్తి నాకు లేదు. విమర్శ నా శక్తికి మించిన పని. అయినా, పద్యాల్ని తాకేంత శక్తి విమర్శకి వుందని నేను అనుకోను. విమర్శలు చాలా మటుకు అపార్థాలుగా మిగులుతాయి. నిజానికి మనం అనుకున్నంత తేలిక కాదు ఏ విషయమైనా చెప్పడం. చాలా విషయాలు చెప్పలేం. పదాలు జొరబడలేని అనుభవాలు చాలా వున్నాయి. ఇక కళానుభవం మరీ విడ్డూరం. మన చిన్నపాటి జీవితాలు వాటి దరిలోకి వెళ్ళనైనా లేవు. ముందే ఈ చిన్న మాట సూటిగా చెప్పేస్తే, ఇక నీ కవిత్వం గురించి!

నీ కవిత్వంలో నీదైన శైలి లేదు, కొండొకచో నీదైన ఏదో వొక ప్రత్యేకత నిశ్శబ్దంగానో, నిగూఢంగానో వుంది కాకపోతే! “నా ఆత్మ” అనే కవితలో ఇలాంటిది చూశాను. అందులో నీదైనదేదో ఒక శబ్దంగా, ఒక లయగా మారే ప్రయత్నం చేసింది. ఇంకో కవితలో ఆ చిన్నపాటి శబ్దము, లయా ఇంకాస్తా గాఢంగా వ్యక్తమయ్యాయి. ఆ రెండు మినహాయిస్తే, నీ కవితల్లో గాఢమైన వ్యక్తిత్వ ముద్ర లేదు. నువ్వు నీ కవితలతో పాటు రాసిన వుత్తరం చదివాక నీ కవితల్లో వున్న లోపాలేమితో ఇంకా స్పష్టంగా అర్థమయ్యాయి నాకు. ఈ రెండీటిని దగ్గర పెట్టుకుని నీ కవిత్వం గురించి ఆలోచిస్తున్నాను.

“నా కవితలు బాగున్నాయా?” అని నీ వుత్తరంలో నువ్వు నన్ను అడిగావు.

నా కంటే ముందు చాలా మందినే అడిగి వుంటావు. నీ కవితల్ని పత్రికలకి పంపి ఉంటావు. వాటిని పత్రికలవాళ్ళు వెనక్కి పంపినప్పుడు, సాటి కవుల కవితలో పోల్చుకొని, బాధపడీ వుంటావు. ఇప్పుడు – నువ్వు నా సలహా అడిగావు కబట్టి చెబుతున్నాను – ఈ ప్రశ్న ఇతరుల్ని అడయటం మానెయ్యి. నీ కవితలు బాగున్నాయా లేదా అని తెలుసుకోడానికి నువ్వు బయటి ఆధారాలు వెతుకుతున్నావ్. ఇకనుంచి అలా చెయ్యకు. నీకెవ్వరూ సలహాలివ్వలేరు, సాయపడనూ పడరు – ఎవ్వరు కూడా!

నువ్వు చెయ్యగలిగేది ఒకే ఒక్కటి – అది నీ లోకి నువ్వు చూడడం! ఏ కారణం నీ చేత కవిత్వం రాయిస్తున్నదో దాన్ని చివరంటా వెతుకు. దాని వేళ్ళు నీ గుండెలోతుల్లో నిజంగా దిగడి వున్నాయా లేదా చూడు. ఎవరైనా ఈ కవిత రాయవద్దు అని నిన్ను కట్టడి చేస్తే, చచ్చినా సరే రాసి తీరుతానన్న మొండి పట్టుదల నీలో వుందేమో చూసుకో. అసలు ఇదంతా కాదు: రాత్రి వేళ నువ్వు మాత్రమే మేలుకుని ఉన్నప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకో – ఈ కవితను నేను రాయాలా? అని! లోతైన సమాధానం కోసం నిన్ను నువ్వు తవ్వుకో. ఆ సమాధానం తన్నుకోచ్చిందా, ఇంకో తిరుగు మాటే లేదా, “రాయాల్సిందే” అన్న మాట ప్రతిధ్వనించిందా , ఇక ఆ అవసరానికి తగ్గట్టుగా దాన్ని నీ జీవితాన్ని నిర్మించుకో. నీ మొత్తం జీవితం – మరీ ప్రతికూలమైన క్షణాలతో సహా – ఈ అద్భుతమైన క్షణానికి సాక్షం కావాలి. ఇక ఆ తర్వాత సహజత్వానికి దగ్గరగా రా. అంతకుముందు ఎవ్వరూ చెప్పలేకపోయింది నువ్వు చెప్పాలి. నువ్వు ఏం చూశావో, ఏ అనుభూతిని పొందావో, ఎంతగా ప్రేమించావో, ఏం పోగొట్టుకున్నావో, ఆ తీవ్రతని ఆ తపనని అందులోకి వొంపెయ్యి.

అట్లాగని ప్రేమ కవిత్వం రాయకు; మరీ మాములైన, అరిగిపోయిన వాటన్నిటినీ వదిలెయ్యి. ఎందుకంటే, వాటిని తీసుకుని పండించడం కష్టం. నీలో అసాధారణమైన శక్తియుక్తులు వుంటేగానీ వాటిలో నీదైన వ్యక్తిత్వాన్ని పొదగ లేవు. కాబట్టి, అలాంటి సదా సాధారణమైన వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. నీ రోజూ వారి జీవితం నీకు మాత్రమే ఏం చెబుతోదో రాయి. నీ దిగుళ్ళూ, కోర్కెలూ, ఆలోచనలూ, నీ నమ్మకాలూ – ఇవన్నీ నీ లోపల నువ్వు ఎలా ఎంత నిశ్శబ్దంగా, నిజాయితీగా అనుభూతి పొందుతావో అలాగే చెప్పు. నీ చుట్టూ వున్న వాటినే కవిత్వంలో వాడుకో. నీ కలళ్ళోంచి పదచిత్రాలు వెతుక్కో. నీకు గుర్తున్న వస్తువులే తీసుకో. నీ రోజూవారీ బతుకులో ఏమీ లేదనుకో, దాన్ని నిందించకు. నిందించుకోవాల్సి వస్తుంది నిన్ను నువ్వే. రోజువారీ బతుకులోనివి చూడలేకపోతున్న నీ లోపాన్ని నిందించుకో. నువ్వు సృష్టికర్తవి. నీకు పనికిరాని క్షణం, స్థలం లేనే లేవు. చివరకి నువ్వు జెయిల్లో వున్నా సరే, లోకపు చప్పుడ్లేవి నీ చెవులకు సోకకున్నా సరే, నీ పసితనాన్ని తలచుకో. అది నీ జ్ఞాపకాల గని. మూసుకుపోయిన గతం ద్వారాల్ని తెరువ్. వాటిల్లోంచి నీ వ్యక్తిత్వాన్ని నిర్మించుకో. అప్పుడు నీ వొంటరితనం నీ అందమైన వెన్నెల గూడు అవుతుంది. నీరవ నిశ్శబ్దంలో కూడా సుదూర జనసంచారాల శబ్దసౌందర్యం వినిపిస్తుంది. ఈ లోపలి తపస్సు లోంచి, నీ లోపలి లోకాల నుంచి పద్యాలు పుట్టుకొస్తాయి. అలా లోపల్నించి పుట్టుకువచ్చినవి బాగున్నాయా లేదా అని ఇతరుల్ని నువ్వు ఎప్పుడూ అడగవుకాక అడగవు. పత్రికలు వాటిని అచ్చు వెయ్యలేదని బాధపడనూ పడవు. ఎందుకంటే, నువ్వు రాసింది విలువైందనీ, అది నీ జీవన శకలమనీ, నీ అనుభవంలోంచి పలికిన స్వరమని నీకే తెలుసు కనుక! అది నీ అంతరంగంలోంచి తప్పనిసరిగా పుట్టుకువచ్చింది కనుక! మంచి పద్యానికి ఇంతకంటే గీటురాయి లేదు.

కాబట్టి ప్రియ మిత్రుడా! నీకు సలహా ఇచ్చేవాణ్ని కాదు. ఇంతకంటే ఏం చెప్పను? లోపలి స్పృహ అంటూ మొలకెత్తిన తరువాత నీ జీవితం తన దారులు తను వెతుక్కుంటూ వెళ్తుంది. అవే నీకు సలహాలిస్తాయి. ఆ అనుభవాలే నిన్ను విశాలం చేస్తాయి. ఆ జీవన వైశాల్యాన్ని బయటి చూపుతో సంకుచితం చెయ్యకు. బయటి సమాధానాలతో నింపకు. ప్రతి ప్రశ్ననీ నీ వొంటరి క్షణాల మధ్య పరీక్షించి చూసుకో.

నేను చెప్పేది ఒక్కటే: రాయకుండా కూడా బతగ్గలిగితే రాయకుండా వుండడమే మంచిది.

మార్చి 2006 »

Published in: on జనవరి 14, 2008 at 2:26 ఉద.  4 వ్యాఖ్యలు  

The URI to TrackBack this entry is: https://afsar2008.wordpress.com/2008/01/14/%e0%b0%ae%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5%e0%b0%82-%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%95%e0%b1%87-%e0%b0%89%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4/trackback/

RSS feed for comments on this post.

4 వ్యాఖ్యలువ్యాఖ్యానించండి

  1. చాలా ఉపయుక్తంగా వుంది. మిగతా ఉత్తరాలు కూడా రాయండి.

  2. “నీ రోజూవారీ బతుకులో ఏమీ లేదనుకో, దాన్ని నిందించకు. నిందించుకోవాల్సి వస్తుంది నిన్ను నువ్వే. రోజువారీ బతుకులోనివి చూడలేకపోతున్న నీ లోపాన్ని నిందించుకో.”
    —Hit me hard.

    ఈ ఉత్తరం బావుంది. మీ అనువాదం బావుంది. మీ బ్లాగు ఇంకా బావుంది. వీలయితే ఆయన కవితల్ని అనువదించడం అవుతుందేమో చూడండి.

    మీ బ్లాగు koodali.orgకు జత చేయండి. ఎక్కువమంది చదివే వీలుంటుంది.

  3. chaala rojulaki o wonderfull vishyam teliya jepparu, sada kruthagnalatho,

  4. i dont know who r u respected sir actually i am the reader of the blog chaduvu.wordpress.com now i watched ur blog in an accedent situation its good and wonderful if u have time watch the chaduvu.wordpress blog also


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

<span>%d</span> bloggers like this: