కవిరాజమూర్తి నవల గురించి నా వ్యాసం ( జూన్ వివిధ)పై జగన్‌రెడ్డి (జూలై 9) రాసిన ఉత్తరం చదివాను. మంచి వివరాలతో, అత్యంత ప్రజా స్వామికమైన స్వరంతో ప్రయోజనకరమైన చర్చకు అవకాశమిచ్చినందుకు జగన్‌కి ధన్యవాదాలు. ఆయన ఇచ్చిన సమాచారం నాకు మున్ముందు ఈ విషయంలో చేయబోయే పరిశోధనకు చాలా ఉపయోగపడుతుంది. జగన్ అతిముఖ్యమైన విగా భావించిన రెండు విషయాల గురించి నేను కొంత వివరించాల్సి ఉంది. కవిరాజమూర్తి ఉర్దూలో రాయడం నాకు ఏమాత్రం ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం కాదు. ఉర్దూ సాహిత్యచరిత్ర (తెలంగాణ అని మాత్రమే కాదు, దేశ వ్యాప్తంగానే) తెలిసిన వారెవరికైనా ‘హిందూ’రచయితలు ఉర్దూలో రాయడం ఏమాత్రం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం కాదు.
రతన్నాధ్ సర్షార్ నుంచి ఫిరాక్ గోరఖ్‌పురి, గోపిచంద్ నారంగ్ దాకా చాలా పెద్ద జాబితా ఇవ్వవచ్చు. (సదాశి వగారి పుణ్యమా అని ఉర్దూ సాహిత్యచరిత్రని ఒకటికి పదిసార్లు చదివే అవకాశం దొరికింది నాతోసహా తెలుగువాళ్లకి…). కాబట్టి నేను అడిగిన ప్రశ్న ఆశ్చర్యం లోంచి వచ్చింది కాదు. నేను వ్యాసం రాయడంలో అసలు ఉద్దేశం అది కానే కాదు. ఈ నవల రాసేనా టికే కవిరాజమూర్తి తెలు గులో కొన్ని రచనలు చేసి ఉన్నారు. ముఖ్యంగా, కవి త్వం రాశారు. ఈ నవల ఆయన ఉర్దూలోని మొదటిరచన. తెలుగులో బాగా రాయగలిగి ఉండీ, ఈ నవల ఆయన ఎందుకు ఉర్దూలో రాశారని నేను అడి గాను. ఈ నవల ఉర్దూలో రాయడానికి ఆయనకేమైనా బలమైన కారణం ఉందా అన్నది నా అన్వేషణ. దానికి ఆ నవల తొలిపాఠకురాలిగా వరలక్ష్మిగారు ఏం చెబ్తారన్నది నాకు ముఖ్యం. అలాగే, ఆ కాలం నాటి ముస్లిమేతర పాఠకులు ఉర్దూ సాహిత్యాన్ని ఎలా స్వీకరించారన్నది కూడా అప్పటి సాహిత్య సంస్కృతిని అర్థం చేసుకోవడానికి చాలా అవసరం.
ఇదే సందర్భంలో మరో ముఖ్యమైన ప్రశ్న-విభజన తరవాత ఎంతమంది ముస్లిమేతరులు ఉర్దూలో రాశారు? సైనిక చర్య తరవాతా, విభజన తరవాతా తెలంగాణలో ఉర్దూ స్థానం మారింది. విభజన తరువాత ఉర్దూలో రాసే ముస్లి మేతరుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. (హిందీలో ఈ తేడా చాలా స్పష్టంగా తెలు స్తుంది. అప్పటివరకూ ఉర్దూలో రాసిన చాలా మంది హిందీలోకి మారారు. విభజనకి ముందే హిందీలోకి మారిన ప్రేమ్‌చంద్ చలా కాలంపాటు తను హిందీలో రాయడం ఏమిటన్న సంశయంలో ఉండిపోయాడు. ‘ఎంత అనుకున్నా, నాకు నా మాతృభాష ఉర్దూనే అనిపిస్తోంది. హిందీలో నేను రాయలేకపోతున్నాను’ అని చాలా సందర్భాల్లో ఆయన బాధపడేవాడట). కాని, ఆశ్చర్యంగా-ముస్లిం సంస్కృతి గురించీ, ఉర్దూ గురించీ రాసే తరం ఆరంభమైంది. అది అటు హిందీలోను, ఇటు తెలుగులోనూ ఏకకాలంలో జరిగింది.
తెలంగాణ సాహి త్య సాంస్కృతిక చరిత్రలోనూ ఇది భిన్నమైన మలుపు. కేశవస్వామి, సదాశివ నుంచి ఇప్పటి లోకేశ్వర్ దాకా కొనసాగుతూ ఉన్న ఈసంప్రదాయాన్ని మనం సునిశితంగా విశ్లేషించాల్సి ఉంది. ఈరచయితలు ఆత్మకథనాలకూ, సంప్రదాయ సాహిత్యరూపాలకూ మధ్య తమవైన కొత్తరచనాధోరణుల్ని ఎందుకు వెతుక్కుంటున్నారో మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఇక-భాషాపరంగా ఉర్దూపాత్ర తెలంగాణలో ఎలాంటి మార్పులకి గురయిం దో మాట్లాడుకోవడంచాలా ముఖ్యం. ఆ విషయం చెప్పడానికి నాకు కవిరాజమూర్తి నవలలో కొంత వెసులుబాటు ఉంది. కాబట్టి,నేను ఈ నవల గురించి ప్రత్యేకంగా రాయడం మొదలుపెట్టాను. 1940కి ముందు ఉర్దూ గురించి మాట్లాడడానికి మనకి చాలా ఆధారాలు దొరుకుతున్నాయి. అవన్నీ ఉర్దూ స్వర్ణయుగా న్ని చెబుతాయి. (1940కి ముందు తెలంగాణలో ఉర్దూపాత్ర గురించి ఇటీవలనే దాట్ల కవిత ఒక మంచి సిద్ధాంత వ్యాసం రాశారు-కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం,2006).
కాని, 1940ల తరువాత ఉర్దూచరిత్ర అంతకంటే ముఖ్యమని నా అభిప్రాయం. తెలుగులో పత్రికారచన, ప్రచురణ, వివిధ సాహిత్య రూపాల విస్తరణలో ఉర్దూది బలమైన ప్రభావం. తెలంగాణ ఆధునికతని నిర్మించడంలో ఉర్దూ కథలు, ఉర్దూ సాహిత్య సంస్కృతి గట్టి ఊతాన్నిచ్చాయి. చాలాకాలం ముస్లిమేతరులు ఉర్దూలోనే రాశారు. ఇవన్నీనిజమే. కాని 1947 తరువాత మారినచరిత్ర మాటేమిటి? ఎంత మంది ఉర్దూలో రాయడం కొనసాగించారు? అప్పటివరకూ తెలుగులో రాస్తూ వచ్చిన ఒక రచయిత ఉర్దూలో నవల ఎందుకురాశాడు? అసలు తెలంగాణ జీవితం గురించి ఉర్దూలో అప్పటిదాకా ఏమైనా నవలలు వచ్చా యా? లేకపోతే, కవిరాజమూర్తిదే మొదటి ఉర్దూ నవల అనుకోవాలా? ఈ ప్రశ్నలకి ఇంకా నా దగ్గర సమాధానాలు లేవు. త్వరలో సమాధానాలు దొరక్కుండా పోతాయా అని ఒక ఆశ. ఈ నవల గురించి ఇంకా నా పరిశోధన కొనసాగుతూనే ఉంది కాబట్టి, ఈ ప్రశ్నలకి ఇప్పటికిప్పుడే తొందరపాటు సమాధానాలు ఇవ్వడంనాకు ఇష్టంలేదు.
ఈ నవల తెలంగాణ సాంస్కృతికచరిత్రకి ఎలాంటి ప్రతిబింబమో/వ్యాఖ్యానమో నేను ఇంకా ఆలోచించాలి. ఇక- జగన్ ప్రస్తావించిన ఇస్లామీకరణ గురించి. ఇస్లామీకరణగురించి శామ్యూల్ హంటింగ్టన్ మాత్రమే మాట్లాడలేదు. పెట్టుబడిదారీ పుస్తక మార్కెట్ మాయాజాలం వల్ల మనకి అతనిపేరే బాగా వినరావడం మనకాలపు మహావిషాదం. అతను చెప్పింది ఇండియాకి వర్తించదని మార్తా నస్బం అనే ప్రసిద్ధ విదుషి ఇటీవలి తన కొత్తపుస్తకంలో ప్రతివాదం చేసింది (క్లాష్ వితిన్, 2007). అయితే, అంతదూరం వెళ్ళక్కర్లేకుండానే- ఒక పల్లెటూరి పిల్లవాడిగా- ఇస్లామీకరణని నేను ఎలా అర్థం చేసుకున్నానో చెబుతాను. ఈ వివరణకి ముందు ఇస్లామీకరణ వొక తిట్టుపదం కాదని గుర్తించాలని నా మనవి. తురకలు లేకపోతే ఊరికి బర్కతు ఉండదని మా చిన్నప్పుడు మా ఊళ్ళో వినేవాణ్ని. బర్కతు- అనే ఇస్లామిక్ విలువ అంత చిన్న చిన్న ఊళ్ళల్లోకి ఎలా వచ్చింది? సాంస్కృతిక విలువలు ఖడ్గాల ద్వారా వ్యాపించవని, పరస్పర అనుబంధాల ద్వారా వ్యాపిస్తాయని దక్కనీ చరిత్ర గురించి పరిశోధించిన రిచర్డ్ ఈట న్ ఎక్కడో రాశాడు.
ఆ తరువాత అనేకమంది చరిత్రకారులు, ఆంత్రోపాలజిస్టులు, రచయితలు ఇస్లామీకరణని ఒక పాజిటివ్ ప్రక్రియగా విశ్లేషిస్తూ విలువైన ప్రతిపాదనలు చేశారు. కాని, మనకి శామ్యూల్ హంటింగ్టన్ తెలిసినంతగా వీళ్లెవరూ తెలిసే అవకాశం లేదు. ఇస్లామీకరణ- భారతీయ సమాజాన్ని ప్రజాస్వామీకరించిన పెద్దమార్పు. ఇది ఎలాంటి మార్పో నాకంటే గట్టిగా బలంగా చెప్పినవాళ్లు ఉన్నారు. ఉదాహరణకి- పర్షియన్ సంస్కృతి నుంచి ఉర్దూ భాషదాకా ఈ మార్పు ఎలా జరిగిందో ప్రసిద్ధ చరిత్రకారుడు ముజఫర్ ఆలమ్ తన పుస్తకంలో నిరూపించారు (2004). నదీం హుస్నేన్, ముషీరుల్ హసన్లాంటి వారు ఈ దిశగా అటు ఆంత్రోపాలజీ నుంచి, ఇటు సాహిత్యం వరకు ఇటీవల చాలా కొత్త విషయాలు చెప్పారు. అవన్నీ వివరంగా చెప్పుకోదగిన సంగతులు. సాహిత్యం గురించి మాట్లాడడానికి మిగిలిన శాస్త్రాల సహాయం ఎంత అవసరమో వాళ్ళ కృషి ద్వారా మనకి అర్థమవుతుంది. మళ్లీ మన పల్లెల్లోకి వద్దాం. అయిదు వందల సంవత్సరాలుగా ఆ మారుమూల పల్లె బతుకుల్లో ఇస్లామీకరణ ఓ పెద్ద మలుపు. స్థానిక పరిధుల్లో ప్రతిఘటనకి అది ఒక ‘నిశ్శబ్ద’ సాధనం.
(బహుశా, ఈ కారణం వల్లనే గద్దర్ పాటలకి పీర్లపండగ పాటలు బాణీలయ్యాయి. గోరటి వెంకన్న కొత్త పాటల్లో సూఫీ నడకా/నడతా కనిపిస్తాయి.) ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, దళితుల బతుకు ల్లో రకరకాల షియా ఇస్లామిక్ ప్రతీకలూ, భావనలూ, భక్తి ధోరణులు చాతుర్వర్ణ వ్యవస్థని సవాలు చేయడానికి నిశ్శబ్దంగా ఉపయోగపడుతున్నాయి. ‘కుళ్ళాయప్ప ఉన్నారు కాబట్టి బతికిపోయినం, సామీ’ అని ఒక దళితుడు నాతో అన్నాడు. (కుళ్ళాయప్ప అంటే టోపీలతో వచ్చిన తురక స్వాములు) ఈ మార్పు శామ్యూల్ హంటింగ్టన్కి ఎప్పుడు అర్థమయ్యేను? ఈ గ్రామా ల్లో నేను విన్న మౌఖిక కథనాల్లో అత్యంత విలువైన సాంస్కృతిక వ్యక్తీకరణలున్నాయి. కబీర్ మనసు మార్చింది వేమన అంటూ ఓ తొంభయ్యేళ్ల దళితుడు ఆసక్తికరమైన కథ చెప్పాడు. అందులో నిజమెంత అన్నది అప్రస్తుతం కాని, ఆ ఇద్దరికీ పొంతన కుదర్చడంలో అతని భావన వెనక ఒక సామాజిక తాత్విక చరిత్రే ఉంది. దానికంటే ముఖ్యంగా మూసలోంచి ఆలోచిస్తే స్థానికత అర్థం కాదన్న పాఠం కూడా ఉంది.
ఇస్లామీకరణ అనేక రూపాల్లోంచి పరిశీలించాల్సిన ఆసక్తికరమైన అంశం. శామ్యూల్ హంటింగ్టన్కి భయపడి ఆ అన్వేషణకి అడ్డుకట్ట వెయ్యక్కర్లేదు. లేదా, కేవలం హిందూత్వవాదుల కళ్లద్దాల్లోంచి మాత్రమే దాన్ని చూడాల్సిన అవసరం లేదు. మళ్లీ కవిరాజమూర్తి దగ్గరికి వద్దాం. హైదరాబాద్ స్టేట్‌ని ఒకానొక బలహీనమైన దశలో ఇస్లామిక్ స్టేట్‌గా ప్రకటిం చాడు నిజాం. అతని ఇస్లాం నేను చిన్నప్పటినుంచీ ఊళ్లలో చూసిన ఇస్లాం వొకటి కాదు. ‘పల్లె ఇస్లాం’కీ, నిజాం ఇస్లాంకీ వ్యత్యాసాలు ఉండడం వల్లనే, తెలంగాణ పల్లెల్లో నిజాం చర్యలు విపరీత పర్యవసానాలకి దారితీశాయి. పల్లెల ఉనికి నిర్మాణంలో స్థానికత చాలా బలమైన పునాది. ఈ స్థానికత లోంచి పుట్టిన ముస్లిం సంస్కృతిలోంచి వచ్చిన కవిరాజమూర్తి నిజాం ‘ఇస్లామీకరణ’ని ప్రతిఘటించ డం సహజం. ఇంతకీ- కవిరాజమూర్తి మీద నేను రాయాలనుకున్న మూడు వ్యాసాల్లో ఇది మొదటిది మాత్రమే. ఇంకా నేను ఆ నవలని పరిచయం చెయ్యాలి. ఆ నవలలో ఆయన ఏ ఇస్లామీకరణ గురించి చర్చించాడో చెప్పాలి. ఆ పని త్వరలో చెయ్యగలనని నమ్మకం.
(July 30, 07 AndhraJyothy)
dear sir