‘ఆ మైదానంలోకి వెళ్లిపోండి. వెనక్కి తిరిగి చూడకండి. తిన్నగా వెళ్లండి సూర్యుడి కిరణంలాగా’
గత కొన్ని దశాబ్దాలుగా ఇదే వాక్యాన్ని పదేపదే వేరేవేరే సందర్భాల్లో చెబ్తూవచ్చిన తీవ్ర స్వరం హీరాలాల్ మోరియాది. నాకు సాహిత్య ఊహలు తెలుస్తూ, అర్థమవుతూ వచ్చిన పదేళ్ళ ప్రాయంనుంచీ ఇప్పటివరకూ మోరియాని అనేక సందర్భాల్లో చూశాను, విన్నాను. మేం అప్పుడు పల్లెనుంచి పట్నానికి వచ్చిన రోజులు. ఒక రోజు సాయంత్రం ఇంటికి తెల్లఖద్దరు బట్టల్లో మంచి మల్లెపువ్వులా ఆయన నడిచివచ్చారు. ఆ సాయంత్రం ఆయనా, నాన్నగారు (కౌముది) ప్రపంచ సాహిత్యాన్నంతా ఆగమేఘాల మీద సందర్శించారు. ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు… భాషల అడ్డుగోడల్లేని సాహిత్య సంభాషణ. ఆ రోజు రాత్రి ఆయన వెళ్ళిపోతూ ‘అఫ్సర్ బేటా’ అని నావైపు తిరిగి పైన చెప్పిన ఒకే ఒక్క పంక్తి చెప్పారు. అదేమాట ఆయన రెండేళ్ళ క్రితం నేను మాడిసన్ నుంచి వచ్చినపుడు (2004) మరోసారి మళ్ళీ చెప్పారు. అది ఆయన్నించి నేను విన్న మొదటి, చివరి మాట కూడా!
మోరియాని తలచుకొంటే నా బాల్యం గుర్తొస్తుంది. మోరియాని తలచుకుంటే యాభైయేళ్ల తెలంగాణ సాహిత్య ప్రయాణం గుర్తొస్తుంది. మోరియాని తలచుకుంటే ఒక మహోద్యమ వారసత్వాన్ని గర్వంగా భుజానికెత్తుకున్న వ్యక్తి కనిపిస్తాడు. ఆయన రాజకీయాల్లో ఎన్నాళ్ళున్నారో నాకు గుర్తులేదు. ఆ మాటకొస్తే ఆయన ఎప్పుడూ ఆ రాజకీయోద్యమాన్ని గురించి మాట్లాడ్డం నేను విన్లేదు. ఎప్పుడు కలిసినా ఆయన చుట్టూ సాహిత్య సంభాషణల జడివాన. రచయిత ఎప్పుడూ రచయితగానే ఉండాలని ఆయన అనేవారు. ఖమ్మంలో చరిత్రాత్మకమైన విజ్ఞాన నికేతనం గ్రంథాలయం వీధిలో మేడమీది ఆయన గది అంటే నాకు విపరీతమైన ఆకర్షణ. అది గదికాదు. ఒక పెద్ద గ్రంథాలయమే. హిందీ, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు పత్రికలూ, పుస్తకాల గుట్టలమధ్య ఒక కుర్చీలో తపస్సులో కూర్చున్నట్టు నిరంతరం ఆయన ఏదో రాస్తూ… ఆలోచిస్తూ… ఆయన రాతల్నీ, ఆలోచనల్నీ తెంపుతూ అప్పుడప్పుడూ నేను ఆయన గదిలోకి వెళ్ళేవాణ్ని. నేను వెళ్లిన మరుక్షణం నాకోసం నాకు అత్యంత ఇష్టమైన ‘రసమలై’ స్వీట్ వచ్చేది. అంతకంటే ఇష్టమైన మోరియా మాటల తీయదనం.. మాట మోరియా తొలి ఆయుధం. ఆయన వాక్ ప్రవాహం ముందు నిలబడడం కష్టం. ఆ ప్రవాహలక్షణమే ఆయన సాహిత్యంలోనూ! కథ, కవిత్వం, చరిత్ర, నవల, విమర్శ, అనువాదం… ఇలా ప్రతీ ప్రక్రియ లోనూ మోరియా పనిచేశారు.
‘రచయిత కావడం అంటే ఒక పెద్ద బాధ్యత. ఇవాళ పది పేజీలు రాయనిది నేను రొట్టె ముట్టను’ అనేవారాయన. రోజూ పొద్దున్నే లేచి కలం పట్టుకుని ఆయనలా రాస్తూ కూర్చునే దృశ్యం నాకు చాలా గొప్ప గొప్ప స్ఫూర్తినిచ్చేది. మోరియా అనేక భాషల సంగమం. ఆయన మాతృభాష మరాఠీ, ఆయన రాసిన భాష ఉర్దూ, ఆయనకు పేరొచ్చిన భాష తెలుగు. ఇది భారతీయ సాహిత్య ప్రపంచంలోనే చాలా అరుదైన సన్నివేశం. ఇంతకీ మీ భాష ఏది?’ అని నేను ప్రతిసారీ గుచ్చిగుచ్చి అడిగేవాణ్ని. ‘సాహిత్యం నా భాష. సాహిత్యం దానికదే భాష. నేను ఏ భాషలో రాసినా ఇక్కడ ఉన్న వాళ్లకోసం రాస్తున్నానన్న సంగతిని నేను మరిచిపోను. నాకు సాంస్కృతికంగా జన్మనిచ్చింది తెలంగాణ. ఈ మట్టిలో పుట్టిన గింజలు తిన్నాను. దీని ఉప్పు తిన్నాను. నేను రాసింది కూడా ఈ నేల కోసమే’ అన్నారాయన ఓసారి.
‘మీరు కాంగ్రెస్ నాయకుల మధ్య తిరిగారు. కానీ మీ మాటలు కమ్యూనిస్టులకంటే పదునుగా ఉంటాయి’ అని ఓసారి అంటే… ‘కాంగ్రెస్లో ఉండడం నా జీవితంలో చాలా యాదృచ్ఛికంగా జరిగింది. నేను ఎప్పుడూ గరీబుల పక్షం. నా రచనల్లో ఎట్లా కనిపిస్తానో నా జీవితంలోనూ అదే చేశాను. నా మాటకీ, నా రాతకీ, నా చేతకీ ఎప్పుడూ తెగని బంధం’ అన్నారాయన. తెలంగాణ రచయితల సంఘం చాలా క్రియాశీలంగా పనిచేసిన 1950 లలో మోరియా రచనలన్నిట్నీ పరిశీలిస్తే ఆయనపైన సామాజిక ప్రభావాలు ఎంత బలంగా ఉండేవో తెలుస్తుంది. అన్నింటికీ మించి, తన చుట్టూ ఒక గొప్ప సాహిత్య వాతావరణాన్ని సృష్టించుకోవడం మోరియాలో విశేషం. విశ్వనాథ, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, రాయప్రోలు, దాశరథి, ఉటుకూరు రంగారావు, కవిరాజమూర్తి, కౌముది, కొలిపాక, గోపాలరావు, మంజు నుంచి ఈ తరం రచయితలదాకా అందరికీ ఆయన ఆత్మీయుడు. వాదాలు ఏవైనా, వివాదాలు ఎన్ని ఉన్నా ఆ మేడమీది ఇంటికి వెళ్లే అందరి మధ్యా పూసలో దారంలా ఆయన తీవ్రస్వరం! ఆయన నిష్క్రమణ తెలంగాణ సాహిత్య చరిత్రకి పెద్ద వెలితి.
<!– –>
స్పందించండి