వాయులీనమవుతూ….

 

 

లోపలి ధ్యానంలో
మెట్లు కనిపించవు
మెల్లగా వొక తీగని చేతులకు చుట్టుకుని
శిఖరం కొసకి చేరుకుంటాం
అక్కడి నిశ్శబ్దం చివరిమీంచి
ఈదురుగాలుల హోరులోనో
అందీ అందని మబ్బుల్లోనో
వొంటరిగా నిలబడి
లోపలికి ప్రవహిస్తాం
జలపాతం వెనక్కి మళ్ళుతుంది లోపల్లోపల.
యెక్కడెక్కడోఅ చెవులు మొలుచుకొచ్చి
దేహమంతా వొక పక్షి ఈక.
అప్పుడింక చూడాలీ వినాలీ
గాలి అలలు
విరుగుతున్న చప్పుళ్ళని.

2

బయటి రోడ్డు మీద
ఉక్కుపాదం
గాలిదేహాన్ని తొక్కేస్తుంది.
రెండు పెదాల్నీ కలిపికుట్టేస్తుంది
తుపాకి భాష ఎక్కడైనా ఎప్పుడైనా
అదే

 

ఊపిరిపీల్చడం నేరం
తన చప్పుళ్ళే మార్మోగాలి
చెట్లకి చిగుర్లు పుడితే నేరం
ఆకుపచ్చగా విచ్చుకుంటే శిక్ష.
చివరికన్నీ ఇనపగజ్జెలే కావాలి
ఇనపమాటలే వినిపించాలి.

అప్పుడింక
వయొలిన్‌ లోపలి ధ్యానానికి
తుపాను భాషనేర్పుతుంది
దాచేసిన నిప్పంతా
సుతిమెత్తని కమానులోంచి
కార్చిచ్చు.

ఎంత చిత్రం!
వయొలిన్‌ నినాదమవుతుంది
వసంతం గర్జిస్తుంది!

(రెండు సింఫనీల అనుభవం తర్వాత వొకటి మామూలుగానే బీతోవెన్‌ది. రెండోది స్టాలిన్‌ కాలంలో వసంతమేఘాల మీదుగా తిరుగుబాటుని ఆలాపించిన వయొలిన్‌.)

 

Published in: on ఫిబ్రవరి 12, 2009 at 1:54 ఉద.  Comments (1)  

The URI to TrackBack this entry is: https://afsar2008.wordpress.com/2009/02/12/%e0%b0%b5%e0%b0%be%e0%b0%af%e0%b1%81%e0%b0%b2%e0%b1%80%e0%b0%a8%e0%b0%ae%e0%b0%b5%e0%b1%81%e0%b0%a4%e0%b1%82%e2%80%a6-2/trackback/

RSS feed for comments on this post.

One Commentవ్యాఖ్యానించండి

  1. అఫ్సర్ గారూ,
    ఎలా ఉన్నారు?
    మీ బ్లాగును ఆలస్యంగా చూశాను..
    చాలా సంతోషమనిపించింది చూడగానే.
    అయితే, ఫాంట్లు మరీ చిన్నవిగా ఉన్నాయి, దయచేసి సెట్టింగుల్లో సరిచేస్తే బాగుంటుందేమో చూడండి..


వ్యాఖ్యానించండి