వంశీ నుంచి వంశీకి…..

judynortonletter

ఎప్పుడో వొక కవితలో రాసినట్టు గుర్తు – వుత్తరాలు దూరాల్ని కలిపే దారాలు – అని! ఇవాళ వొకే వొక్క సారిగా నీ వుత్తరాలన్నీ చదివాక అనిపించింది, వుత్తరాలు దూరాల్ని కలిపే దారాలే కాదు, తరాల్ని కలిపే, అంతరాల్ని చెరిపే సఖ్యరాగాలు అని!

అవును, సఖ్యత, సహనం ఇవీ ఇవాళ మనకి అత్య్గవసరంగా కావలసిన నిత్యావసర వస్తువులు. నిజానికి ఇక్కడ నేను వస్తువులకి బదులు భావనలు అనే పదం వాడాలి. కాని, వుద్దేశపూర్వకంగానే వస్తువు అనే పదం వాడాను. ఎందుకంటే, చూస్తూ చూస్తూ వుండగానే మనం భావనలకి దూరమయి, వస్తువులకి దగ్గిరయ్యాం. ఏదయినా వస్తువుకున్న గౌరవం, విలువా భావనకి లేదు. ఇంట్లో ఫ్రిజ్ కి వున్న విలువ చల్లని మనసుకి లేదు. ప్లాస్మా టివీకి వున్న విలువ మన మధ్య కబుర్లకి లేదు. అందమయిన ఫర్నీచర్ కి వున్న విలువ ఆతిధ్యంలోని ఆత్మీయతకి లేదు.

మనసులు ఇరుకు అయినా పర్లేదు, కాని, ఇల్లు రాజసౌధంలా వుండాలి. మరేమీ ముఖ్యం కాదు, ఇంట్లో వస్తువులు తప్ప. అలాంటి వస్తువుల్ని వుత్పత్తి చేసే శక్తి మాత్రమే గొప్ప శక్తి. ఇతర శక్తులు అసమర్ధుల భావనలు. డబ్బు సంపాదించలేని వాళ్ల సాకులు. చుట్టూ ఏం జరుగుతున్నా సరే, మన ఇల్లు విలాస వస్తువులతో నింపుకుంటే చాలు. వీధులు రక్తసిక్తమవుతుంటాయి. ఈ పూటకి కడుపు ఎలా నింపుకోవాలా అని సగానికి సగం జనం పొట్ట పట్టుకుని, చౌరస్తాల్లో శరీరాలే పనిముట్లుగా అడ్డాలలో నిలబడి వుంటారు. అయిననూ, మన గది భద్రంగా వుంటే చాలు. మన లాభాలు ఎడతెగక పారితే చాలు. మన పాచికలు విజయవిహారాలు చేస్తే చాలు.

ఇలాంటి వస్తు భావనలు మస్తుగా వున్న ఈ కాలంలో – వంశీ, నీ ఆలోచనలు, నీ అనుభూతులు వొకింత విచిత్రంగా వుండక మానవు. ఈ వుత్తరాలు చదువుతున్నప్పుడు చాలా మందికి ఇవి ఎదో చిత్రమయిన లిపిలో కనిపించి, కాసేపు వుక్కిరిబిక్కిరి అవ్వక మానరు. చాలా కాలం క్రితం నా లోపల కవిత్వమనే వొక పురుగు మసిలి సతమతం చేస్తున్న తొలి రోజుల్లో బెజవాడలో మోహన రాం ప్రసాద్ అనే మిత్రుడు – వాక్యం అంటే disturb చెయ్యాలి. వాక్యం అంటే పునాదిమట్టంగా destruct చెయ్యాలి- అని రాసి చూపించాడు వొక చిత్తు కాగితమ్మీద.  ఇది తన కవిత్వ motto అని ప్రకటించుకున్నాడు. నిజానికి అది గొప్ప కవిత్వ వాక్యం అని నేనేమీ చెప్పను కాని… ఆ సమయంలో అది వొక మాని ఫెస్టొ లాంటి వాక్యం లాగా అనిపించింది. ఇవాళ వంశీ వుత్తరాలు చదువుతున్నప్పుడు అలాంటి ఆవేశమే కాసేపు పట్టి కుదిపింది. ఈ వుత్తరాల్లోని చాలా వాక్యాలకు వొక కవిత్వ వాక్యానికి వుండాల్సినంత పొగరూ, విగరూ, వగరూ వున్నాయి.

వంశీ మంచి కవి/ కథకుడు/విమర్శకుడు. అతని మనహ్ కార్మికశాల అనేక భావనల కొలిమి. నిజమయిన వూపిరితో, స్వచ్చమయిన మనసుతో వూదీ, వూదీ నిప్పు కణికల్ని మన కళ్ల ముందు మెరిపించే వచనశిల్పి వంశీ. మనకి మంచి వచనం రాసే వాళ్ళు లేరన్నది వాస్తవం. చాలా మంది వచనం పేరుతో మన కళ్ల ముందు పేర్చేది తడి కట్టెలు. అవి చితి పేర్చుకోడానికి కూడా పనికి రావు.  వచనం పే రుతో వొట్టి దగా. పోనీ అది కవిత్వమూ కాదు. కవిత్వం పేరుతో ఆత్మ/ పర వంచన. ఎక్కడో ఇంగ్లీషులో చదివిన వాక్యాల్ని తెలుగులో కక్కి మన మనసుల్ని మురికి చేసే ప్రక్రియ. అలాంటి వచన వంచనలకూ, కవిత్వ నేరాలకూ వంశీ మొదటినించీ దూరం. గత రెండు పదులుగా వంశీ రాస్తూ వస్తున్న కవిత్వ, కథా, విమర్శ రచనల్లో ఇది కనిపిస్తున్న సత్యమే. ఇవాళ నేను ప్రత్యేకించి చెప్పక్కరలేదు.

 

ఈ వుత్తరాల్లో వంశీ ఇంకాస్త బాగా అర్ధం అవుతాడు. ఇన్నాళ్లుగా అతని రచనల అంతరంగంలోని మాటని ఈ వుత్తరాలు ఎలాంటి దాపరికమూ లేకుండా విప్పి చెబుతాయి, రెండు కారణాల వల్ల – వొకటి, వంశీ తనలోకి తాను తొంగి చూసుకునే ఆంతరంగిక వేళ ఇవి రాశాడు. తనలోకి తాను తొంగి చూసుకున్నప్పుడు తనని తానుగా అన్ని బలహీనతలతో, అశక్తులతో, సంశయాలతో , సంకోచాలతో అందుకునే వ్యక్తి కోసం రాశాడు. చాలా సందర్భాలలో ఈ వుత్తరాలు చదువుతున్నప్పుడు నాకు బుచ్చిబాబు అంతరంగ కధనం గుర్తుకి వచ్చింది. వంశీ చాలా సార్లు ఈ వుత్తరాల మధ్య చలాన్ని ప్రస్తావిస్తాడు కాని, నిజానికి బుచ్చిబాబులోని ఆ ప్రచండమయిన అంతరంగ తీవ్రతే వంశీలో వుంది. చలం వుప్పెన లాంటి వాడు. వొక్క క్షణం ఆలోచించే వ్యవధి ఇవ్వడు. బుచ్చిబాబు సెలయే రు, తెలియని ఆ వేగంలో, తీవ్రతలో ఆలోచించుకునే నిబ్బరం కాస్త వుంది. వంశీలోనూ ఈ గుణం వుంది, వ్యక్తిగా, రచయితగా.

వంశీ, నేనూ ఇరుగుపొరుగు వూళ్లలో పెరిగాం. ఇరుగుపొరుగు వీధుల్లో చదువుకున్నాం. వొకే చోట కలిసి పని చేశాం. అన్నిటికీ మించి చాలా పుస్తకాలు కలిసి చదివాం, చాలా ఆలోచనలు కలిసి చేశాం. అలా కలిసి పెరగడంలో కొన్ని సంతోషాలూ, కొన్ని దుఖ్ఖాలూ వున్నాయి. ఎవరినించి ఏం తీసుకున్నామో తెలియదు. అలా తీసుకుంటొ, తీసుకుంటొ వొక దశలో అహాలు పెరిగి, వొకళ్లనొకళ్లం క్షమించుకోవడం మానేస్తాం. చుట్టు వున్న వ్యాపార సూత్రాలు అవతలి వ్యక్తి లోని గొప్పతనాన్ని వొప్పుకోనివ్వవు. ఇంతా చేస్తే, మనం వున్నది వస్తుగతమయిన వ్యాపార లోకమే! మిత్రులు శత్రువులవుతారు. లేదా, మిత్రత్వపు ముఖం కింద శత్రుపార్శాన్ని దాచుకుని, నటించడం మొధలు పెడతారు. అలాంటి వ్యాపార వస్తు వంచనత్వం వంశీకి పట్టుబడలేదు.

అంతటా వ్యాపార వ్యామోహమే జీవన శాసనం అయ్యినప్పుడు….అప్పుడేం చెయ్యాలి? ఎవరికయినా మనసు విప్పి వొక వుత్తరం రాయాలి, ఈ మెయిల్స్ , సెల్ ఫోన్స్ , ఫోన్స్ పక్కన పడేసి, పొస్టాఫిస్ కి వెళ్లి, వొక నీలి కవరు కొనుక్కొచ్చి, ఎగశ్వాస, దిగశ్వాస వినపడేట్టు- కొన్ని అక్షరాలు సిరాలోంచి కాగితమ్మీదికి ఎలాంటి పూచీకత్తు లేకుండా రాలాలి.

అలాంటి అనుభూతి కలగలేదనుకోండి.

అప్పుడు – ఈ వంశీ వుత్తరాలు  చదవండి. వాటిల్లో మనసుని తేలిక చేసే  చిక్కని ఇరానీ చాయ్ గమ్మత్తు వుంది. చదివాక –  ఎంత కాదన్నా కాస్త మనసు తడుస్తుంది.

అప్పటికీ మనసు రాలేదనుకొండి.

అప్పుడు –

ఈ నానా వస్తువ్యాపార పట్టణ మహమ్మారిని వదిలించుకొని – వొక ఆకుపచ్చని దారి గుండా వొక చిన్న వూరికి కాలి నడకన వెళ్ళండి.

ఖమ్మం నించి మధిరకి పాసింజరు బండిలో ఎక్కి, పందిళ్లపల్లి అనే చిన్న వూరి దగ్గిర దిగండి. ఆ వూళ్లో చెట్లకి , ఆ వూరి మధ్య నాటకాల ఆరుబయలుకి ముప్పయ్యేళ్ళ కింద సత్యం అనే పిల్లగాడు తెలుసు. అతని తండ్రికి బడి పిల్లలన్నా, నాటకాలన్నా ప్ర్రాణం కాబట్టీ , ఆ పంతులు గారి అబ్బాయి అని చెప్పండి వివరం కోసం.

ఆ వూరికి నాటకాల కోసం నేను చింతకాని నించి నడుచుకుంటూ వెళ్లిన చిన్నతనంలో ఆ పంతులు గారి అబ్బాయిని మిస్సయ్యాను.  చాలా కాలం తర్వాత కలిసినప్పుడు మనం ఇద్దరం వొక వూరి గాలి కలిసి పీల్చాం, వొక వూరి నీళ్లు కలిసి తాగాం. వొక వూరి ఆరుబయలులొ కలిసే ఆ నాటకాలు చూసి వుంటాం, అన్నాను. అది అంటున్నప్పుడు కూడా వంశీ ఎవరో నాకు పెద్దగా తెలియదు, ఈ వుత్తరాలు చదివాక తెలిసినంతయినా.

కాని, అది వూహ తెలియని లోకం. బహుశా ఇంకా మనకి వూహ తెలియలేదనే అనుకుంటాను. అప్పుడప్పుడూ ఇలాంటి  వుత్తరాలు చదువుతున్నప్పుడు కొన్ని వూహలు తెలుస్తాయి. ఆ పల్లెటూరి ఆకుపచ్చ దారి లా అవి తెరుచుకొంటాయి. కాసేపు పసితనంలోకి వెళ్లి , వూహల స్కేలు మీద వాటి తీవ్రతల్ని ఆనవాలు పడతాం.

అలాంటి వుత్తరాల వూహల ఆనవాళ్లని కానుక చేస్తున్న వంశీకి

 ……   ప్రేమతో …………….. సరిహద్దుల ఆవలి నించి………………………………..

 

అఫ్సర్

 

 

Published in: on ఫిబ్రవరి 17, 2009 at 6:12 సా.  3 వ్యాఖ్యలు  

The URI to TrackBack this entry is: https://afsar2008.wordpress.com/2009/02/17/%e0%b0%b5%e0%b0%82%e0%b0%b6%e0%b1%80-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%b5%e0%b0%82%e0%b0%b6%e0%b1%80%e0%b0%95%e0%b0%bf/trackback/

RSS feed for comments on this post.

3 వ్యాఖ్యలువ్యాఖ్యానించండి

 1. మీ పరిచయమే ఒక కవితలా ఉంది.
  ఇన్నాళ్ళకు మళ్ళీ ఇలా కలుసుకోగలిగినందుకు సంతోషంగా ఉంది
  మీ
  దార్ల

 2. గురువుగారు
  ఇది పుస్తకపరిచయమా?
  ఈ వంశీ ఎవరు పసలపూడి కధలు వ్రాసిన వంశీనా?

 3. Great writeup… details and style of explains remebers me my childhood days, and friends… really we are missing so much after start emails… while before when we wrote letters to friends every body tried to make good and beautifull sentenaces. but now ?????? now everyting in shortcut … h…r….u. like etc.,


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: