రిచార్డ్ ఈటన్ తో ఒక సంభాషణ

 

eatonచరిత్ర భాష అతనికి తెలుసు.  సంక్లిష్టమయిన పూర్వ ఆధునిక గతాన్ని అరటి పండు వొలిచి చేతిలో పెట్టినట్టు, వొక మరచిపోలేని కథలాగా చెప్పడం ఆయనకే సొంతమయిన శైలి. ఆయన వచనంలో  నిన్నటి చరిత్ర కళ్లకి కట్టినట్టు మన ముందు నిలబడుతుంది.  ఆయన పేరు రిచార్డ్ మాక్స్ వెల్ ఈటన్ . ఈ మధ్యనే ఆయన 1300 నుంచి 1761 వరకూ కాలాన్ని తీసుకుని రాసిన దక్కను చరిత్రని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం అచ్చు వేసింది. ఇందులో ఆయన మనకు తెలిసిన సర్వాయి పాపడు, ప్రతాప రుద్రుడు, రామరాయలు, మహమూద్ గవాన్ ల వంటి చారిత్రక వ్యక్తుల గురించి మనకి తెలియని చరిత్ర కోణం నుంచి రాశారు.

ఈ పుస్తకం నిండా మనకు తెలిసిన మన వరంగల్లు, దేవగిరి, బీదరు, గోల్కొండ, తిరుపతి, షాపూర్ , తెలంగాణా లాంటి ప్రదేశాలు కొత్త ఆధారాల వెలుగులో తళుక్కుమంటాయి. కథ చెప్పడమంటే ఈటన్ కి భలే ఇష్టం! ఆ కథల్లో  తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ, ఫారసీ, బెంగాలీ భాషల అందాలు వాటి వాటి సహజ అందాలతో, జీవకళతో కళ్ల ముందు కదలాడతాయి. ఈటన్ తో మాట్లాడ్డం అంటే – ఆ భాషలతో, వాటి గతంతో సంభాషణే! ఆయన చరిత్ర పుస్తకాలు చదవడం అంటే ఆ అపూర్వమయిన పూర్వ ఆధునిక కాలాల్లో సంచారమే!

ఏడాదికి వొక సారి మాడిసన్ లో జరిగే దక్షిణాసియా సదస్సుల మేళాలో నాలుగేళ్ల క్రితం మొదటి సారి ఈటన్ తో నాలుగు మాటలు కలిసినప్పుడు గొప్ప ఆనందం. అదే సమయంలో ఆయన దక్కను చరిత్ర పుస్తకం పూర్తి అయ్యింది. వ్యక్తుల జీవితాల్ని ఆధారంగా తీసుకుని చరిత్ర రాయడమనే కొత్త ప్రక్రియకి ఆయన ఓనమాలు దిద్దిస్తున్నారు. సర్వాయి పాపడు జీవితంలోంచి తెలంగాణా చరిత్రని చూడడం, రామరాయలు కథలోంచి గోల్కండ, విజయనగర చరిత్ర వినిపించడం లాంటివి చాలా మందిని ఆకట్టుకున్నాయి. అసలు వ్యక్తి, సమాజ చరిత్ర, రాజకీయాలు, సంస్కృతి కలగలిసే చోటులోంచి చరిత్రని చూడాలన్న తపనకి శాస్త్ర ప్రతిపత్తి కలిగించిన ప్రయాణం అది. ఆయన ఈ కొత్త దారిలో ఎందుకు వెళ్లారా అన్నది ఆసక్తికరమయిన అన్వేషణ. ఈ సారి ఆయన దృష్టి దక్కనులోని పూర్వ ఆధునిక దుర్గాల మీదికి మళ్లింది. ఆ దుర్గాలు అధికార కేంద్రాలుగా మారడం, వాటి వాస్తుకీ, అప్పటి రాజకీయ సామాజిక జీవనానికీ వున్న చుట్టరికం ఎలాంటిదన్న ప్రశ్న వైపు ఆయన ఆలోచన వెళ్లింది. గత వారం టెక్సస్ విశ్వ విద్యాలయం ఆసియా విభాగం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన దక్కనీ రాజుల కోటలూ దుర్గాల వాస్తు మీద చేసిన ప్రసంగం తర్వాత మేం ఆయనతో మాటల్లో పడ్డాం. ఆ మాటలు మరునాడు దాకా సాగాయి. ప్రశాంతమయిన ఆస్టిన్ ఫోక్ హౌస్ మీద చలికాలపు పొద్దుటి సూర్యుడి బలహీనమయిన కిరణాలు పడుతున్నప్పుడు –  మంచి బ్రేక్ ఫాస్ట్ , వేడి వేడి కాఫీ కడుపులో పడ్డాక – మా వేడి వేడి కబుర్లు మొదలయ్యాయి. మాతో పాటు ఇప్పుడిప్పడే బెజవాడ కనక దుర్గమ్మ చరిత్ర మీదా, తెలంగాణా బతుకమ్మ మీదా  ప్రేమ పెంచుకుంటున్న నా విద్యార్ధి జాన్ రోజ్ కూడా వున్నాడు. దక్కను చరిత్ర గురించి ఈటన్ మాట్లాడుతున్నప్పుడు ఈ దక్కనీ చరిత్ర పరిశొధక పుటల్లో తను ఏ పంక్తిలో వున్నానా అని వెతుక్కుంటున్నట్టుగా వున్నాడు జాన్ . అసలు ఏది దక్కను, దాని పటం ఎందాకా వుంది అన్న ప్రశ్నలో తలమునకలయ్యి ఎక్కడ తేలాలో ఎక్కడ మొదలు పెట్టాలో తెలియని స్థితిలో అసలు చిన్న ప్రశ్నలతో మొదలెడదాం. ఆ తర్వాత ఎక్కడయినా పెద్ద గంగలో మునకేద్దాం అన్నాను నేను. ఆ తర్వాత మూడు గంటల పాటు ఏకధారగా సాగిపోయింది సంభాషణ.

ఈటన్ కీ, నాకూ వొక చోట చుట్టరికం వుంది. అది దక్కనీ ఇస్లాం. కాని, దక్కనుని అర్ధం చేసుకోవడానికి ఇస్లాం ఎంత ముఖ్యమో, అట్టడుగు ముస్లిమేతర కులాల చరిత్ర, మత పద్దతులు కూడా కీలకం అని నా వాదం. దాంతో ఆయనకి ఎలాంటి పేచీ లేదు కాబట్టి మా మధ్య మాటలు బాగా నడిచాయి. పక్కనే వున్న జాన్ కి  దక్కను గొడవ మరింత అర్ధం అవ్వడానికి ఆయన మా మాటల్లోని సాంద్రతని కొంత తగ్గించారు కూడా. అయినా, సంక్లిష్టంగా మాట్లాడడం, రాయడం ఆయన శైలి కాదుగా!

గుంటూరు పెద్దాయనా – దక్కను సూఫీల కథలూ

దక్కను మీద మీకు ఆసక్తి ఎలా కలిగింది?

 నిజానికి అది నా బుర్రలోంచి వచ్చిన ఆలోచన కాదు. పీ ఎచ్ డి కోసం మాడిసన్ – విస్కాన్సిన్ వెళ్లాను. అప్పుడు అక్కడ ప్రొఫెసర్ రాబర్ట్ ఫ్రైకెన్ బర్గ్ వున్నారు. ఆయన మీ గుంటూరు వాడే. అక్కడ పెరిగిన వాడు. గుంటూరు మీద మంచి మోనోగ్రాఫ్ రాశాడు. నేను మాడిసన్ లో చదువుకుంటున్న కాలంలో ఎక్కువ మంది ఉత్తరాది మీదా, ఇస్లాం మీద ఆసక్తి వున్న వాళ్లు అయితే మొగల్ చరిత్ర మీదా పని చేసేవాళ్ళు.  ఎవర్ని అడిగినా, మొగల్ …మొగల్ అనే వాళ్లు.   దానికి భిన్నంగా ఏమయినా చెయ్యాలనుకున్నాను. సరే, ఫ్రైకెన్ బర్గ్ కి దక్షిణ భారతం అంటే  ప్రేమ. బీజపూర్ , అహ్మద్ నగర్ , గోల్కండ….ఈ దిక్కు ఆలోచన చెయ్యమన్నారాయన. ఆ తర్వాత నేను హైదరాబాద్ వెళ్లి పాత కవిలె కట్టలు వెతుకుతూంటే, సూఫీ ఫక్కీర్ల కథలు పర్షియన్ లో దొరికాయి. దాంతో నా దృష్టి అటు మళ్లింది. దక్కనీ ఇస్లాం నన్ను ఆకట్టుకుంది.

ఒక చరిత్రకారుడిగా సూఫీల పాత్రని మీరు ఎలా అంచనా వేస్తారు?

– చాలా మంది పరిశోధకులు సూఫీల్ని ఈ లోకంతో అసలే మాత్రం సంబంధం లేని పరలోక జీవులుగానే చూశారు. ముఖ్యంగా ఇస్లాం మీద జరిగిన చాలా పరిశోధనలు ఆ దిక్కు గానే వెళ్లాయి. ఇప్పటికీ అలానే వెళ్తున్నాయి. ఇస్లాం, సూఫీ ల సామాజిక పాత్రని చాలా మంది పట్టించుకోవడం లేదు. అసలు ఆయా కాలాల్లో ఈ సూఫీలు ఏం చేశారు? వాళ్ల కథలూ, వాళ్లు వున్న ప్రదేశాలూ చిన్న చిన్న దక్కనీ పల్లెల్లో కూడా ఎందుకంత ప్రభావాన్ని చూపిస్తున్నాయి? అసలు వీళ్లు కొత్తగా సమాజంలో ఏం చెయ్యడం మొదలు పెట్టారు? ఈ మూడు ప్రశ్నలే నేను పదే పదే వెతుక్కుంటూ వచ్చాను. మతం సామాజిక పాత్రని గురించి మాక్స్ వేబర్ లాంటి వాళ్లు చాలా చెప్పారు. అసలు ఈ సూఫీలు దక్కనులో ఎవరు?  వీళ్లు పండితులా? సంస్కర్తలా? అసాధారణ శక్తులున్న దైవ దూతలా?  వాళ్లు కేవలం ఇస్లాం సైనికులా? సమాజానికి వీళ్ల అవసరం ఎందుకొచ్చింది? అనుకుంటూ , వాళ్ల సామాజిక చరిత్రని తవ్వుకుంటూ వెళ్లాను. ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల సూఫీలు వున్నప్పుడు, ప్రత్యేకించి దక్కనీ సూఫీలు ఎవరు? ఆ దక్కనీ తనం ఏమిటి? అన్నది నా ప్రశ్న. అది అంత తేలికపాటి ప్రశ్న కాదు. ఇన్నాళ్లుగా నేను చేస్తూన్న పని అంతా ఆ ప్రశ్నకి సామాజిక కోణం నించి జవాబు రాబట్టడం ! ఇది అంతకు ముందు సూఫీవాదాన్ని కేవలం మార్మిక ధోరణిగా చూసిన దానికి భిన్నమయిన దారి.

హైదరాబాద్ లో దొరికిన సూఫీ జీవిత కథలు ఈ అభిప్రాయాన్ని ఎలా మార్చాయి?

  జీవిత కథలు మామూలుగా చదివినా, చప్పున స్ఫురించే సంగతి వొక్కటే: సూఫీలు పరలోకమే పరమార్ధంగా బతకలేదు అని! మార్మిక వాదాన్ని నేను పూర్తిగా కాదనడం లేదు. కాని, వాళ్లు ఈ లోకంలో వుంటూ, ఇక్కడ కచ్చితంగా కొన్ని అక్కరకొచ్చే పనులు చేశారు. ఆ పనుల గురించి మాట్లాడితే తప్ప, వాళ్ల పాత్ర గురించి సరయిన అంచనా వెయ్యలేం. బీజపూర్ సూఫీల మీద  రాసిన పుస్తకంలో ఆ ప్రయత్నం చేశాను. దక్కను సూఫీ జీవిత కథలు అంతకు ముందు నాకు సూఫీ వాదం మీద వున్న అభిప్రాయాల్ని పూర్తిగా మార్చి వేశాయి. సూఫీలు వొక కొత్త ప్రేమపాఠాన్ని మనకు నేర్పించడం మొదలెట్టారు. సమాజంలోని భిన్న వర్గాల మధ్య వుండాల్సిన కొత్త బంధాన్ని గుర్తు చేశారు. ఆ బంధానికి కావలసిన కొత్త సూత్రాలు మార్మిక వాదంలో లేవు. ఈ సమాజంలోనే వున్నాయి. మధ్య యుగ భారతానికి వాళ్లు మైలు రాళ్లు, ఆశాకిరణాలు. చరిత్ర ఆధారాల్ని సునిశితంగా చూస్తే, ఇస్లాం గాని, సూఫీ వాదం గాని కత్తులూ కటార్లతో విస్తరించిన భావన కాదని  మనకి అర్ధమవుతుంది. సూఫీలు ప్రతిపాదించిన కొత్త ప్రేమ, కొత్త బంధాల సూత్రాలు ముస్లిమేతరులని సున్నితంగా కట్టిపడేశాయి. వూరూరా తిరిగిన సూఫీ మునులు జనజీవనంలో భాగమయ్యారు తప్ప వూళ్లకి దూరంగా బతకలేదు. అలా బతుకుతున్నప్పుడు వాళ్లు ఉన్నతమయిన కొత్త ఆలోచనల్ని జనంలోకి తీసుకు వచ్చారు. ఆ ఆలోచనల ఆనవాళ్లు పట్టుకునే పని చెయ్యడం ముఖ్యం అనుకున్నాను.

అలా ఆలోచిస్తున్నప్పుడు మీకు వెంటనే దొరికిన ఆధారం ఏమిటి?

చాలా మంచి ప్రశ్న.  నేను రకరకాల పుస్తకాలు, కవిలె కట్టలు గాలిస్తున్నప్పుడు, అనేక మందితో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడూ ఈ ప్రశ్న నన్ను వుక్కిరి బిక్కిరి చేసేది. అలా మధన పడగా, పడగా దొరికిన జవాబు : ఆ కాలంలో జనం వాడిన భాషే మొదటి పనిముట్టు అని. దక్కనీ అని పిలుస్తున్న ప్రాంతాల్లో జనం భాష ఏమిటి? మీరు తెలుగు ప్రాంతాలు అని పిలుస్తున్న ప్రాంతాల్లో ఇప్పటికీ జనం వొకే వొక్క తెలుగు మాట్లాడుతున్నారా? మీరు చెప్పండి. లేదు కదా! తెలుగుతో పాటు ఇతర భాషలు మాట్లాడుతున్నారు. ఆ భాషలు ఏమిటి? వాటి వాటి సామాజిక పాత్రలు ఏమిటి? అన్న ప్రశ్న ఇప్పుడు కూడా ముఖ్యమే! చాలా ముఖ్యంగా ఉర్దూ,  ఫారసీలు. అవి కేవలం రెండు వేరే  భాషలు కావు. ఆ భాషలు జన జీవనంలోకి అడుగు పెట్టాక చాలా మార్పు వచ్చింది. అది ఎలాంటి మార్పు? వొక భాష బతుకుని మారుస్తుందా? మారుస్తుంది. ముందు భావనలు మారతాయి. మొత్తంగా దక్కను ప్రాంతం భాషకి దక్కనీ అస్తిత్వమే వుంది. తెలుగు, కన్నడ, మరాఠీ., ఉర్దూ వీటన్నిటికీ వాటి వాటి విశిష్టతతో పాటు దక్కనీ గుణం వుంది. అది మన అవగాహనకి చాలా అవసరం. ఏది దక్కను? అన్న ప్రశ్నకి మనం  చాలా రాజకీయ కారణాలూ, భౌగోళిక పరిమితులూ వెతుకుతాం గాని, ఆ భాష ఎందాకా వుంది, ఎలా వుంది అన్నది చూడాలని అనుకుంటాను నేను.

 

వ్యక్తుల జీవితాలు చరిత్ర పరికరాలు

 

     రిచార్డ్ ఈటన్ లో నాకు బాగా నచ్చిన కోణం : ఆయన చరిత్ర పరిశోధనా విధానం. ఇటీవలి ఆయన పుస్తకం- దక్కను సామాజిక చరిత్ర – లో కీలకవ్యక్తుల జీవిత చరిత్రలు ప్రధాన ఆధారంగా ఆయన చరిత్రని శోధించారు. ఎనిమిది మంది వ్యక్తుల జీవిత చరిత్రల్ని తీసుకుని, 1300-1761 మధ్య దక్కను చరిత్రని ఆయన విశ్లేషించారు. అసలు సరయిన చరిత్ర అంటూ ఏదీ లేదు, ఉన్నదల్లా  జీవిత చరిత్రలే! అన్న ఎమర్సన్ వాక్యంతో  మొదలు పెట్టిన ఈ పుస్తకం ముందు మాటలో తన కొత్త పరిశోధనా విధానాన్ని వివరించారు. కాని, జీవిత చరిత్రని ప్రధాన ఆధారంగా తీసుకుని సామాజిక చరిత్ర రాయడంలో అనేక సమస్యలున్నాయి. ఒక వ్యక్తి జీవితాన్ని అప్పటి సమాజ చరిత్రగా ఎలా ఆలోచించగలమన్నది ముఖ్య సమస్య అయితే, వ్యక్తిగత కథనాల్లోంచి సామాజిక సారాంశాన్ని ఎలా వడపోస్తామన్నది మరో పెద్ద చిక్కుముడి. చరిత్ర రచనకి సంబంధించిన ఈ కొత్త కోణం మీదికి మా సంభాషణ మళ్లింది.

ఇలా రాయడంలో వొక్కసారిగా అనేక ప్రయోజనాలు కలిసివస్తాయి. ముందు, చరిత్ర అనగానే మొహం తిప్పుకునే పాఠకుల్ని చరిత్ర వైపు తిప్పవచ్చు. కథలు, అందునా జీవిత కథలు ఎవరినయినా ఆకట్టుకుంటాయి. తెలియని వొక ఆకర్షణ ఏదో అలాంటి కథల్లో వుంటుంది.  ఇతరుల కథలు తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా మనలో సహజం. నైరూప్యంగా అనిపించే ఏదో సిద్దాంత రచన చదివే కన్నా ఈ విధమయిన రచన ఎక్కువ మందికి నచ్చుతుంది. ఎక్కువ మంది చరిత్ర పుస్తకాల వైపు మళ్లాలన్న చిన్న ఆశ నన్ను ఈ ప్రయోగం వైపు తీసుకువెళ్లింది. ఆ విధంగా చరిత్రని మనం మానవీకరణ చెయ్యవచ్చు. దాంతో పాటు, సిద్దాంతాన్ని వాస్తవికతకి అన్వయించడానికి వీలు దొరుకుతుంది. ఈ క్రమంలో నేను చేసిందేమిటంటే, నా రచనలో వ్యక్తికీ, సమాజానికీ మధ్య ప్రయాణం చేశాను. వాటి రెండీటికీ మధ్య రాకపోకలు సాగించాను. అలా ఎంత దూరం వెళ్లానంటే, అవి రెండూ వొక దానిలో వొకటి లీనమయి పోయేట్టుగా!  అలా రాస్తున్న కొద్దీ అసలు చరిత్ర రాసే విధానం ఇది అని గట్టిగా అనిపించడం మొదలెట్టింది నాకు. అంటే, ఇదొక్కటే విధానం వుందీ అని కాదు, తప్పనిసరిగా ఇది బలమయిన విధానం అనిపించింది. పైగా, దక్కను చరిత్రకి ఈ విధానం చక్కగా సరిపోయింది. ఒక బలమయిన కేంద్రం లేని చరిత్ర దక్కనుది. అలాంటి బలమయిన కేంద్రం ఏదీ లేనప్పుడు సహజంగానే చరిత్ర రచనకి అనేక ఇబ్బందులుంటాయి. సరయిన ఆధారాలు దొరకవు. ఏదీ నిశ్చితంగా చెప్పలేం. ఈ విషయం నిన్న మీతో మాట్లాడుతున్నప్పుడు మళ్లీ ఆలోచించాను. అందుకే, చాలా మంది చరిత్రకారులు డిల్లీ గురించో, మొగల్ సామ్ర్రాజ్యం మీదనో అనగానే చప్పున పనిలో దిగిపోతారు. ఎందుకంటే, అవి చాలా నిశ్చితమయిన కేంద్రం వున్న రాజ్యాలు. వాటికి రికార్డులు కుప్పలు తెప్పలుగా దొరుకుతాయి. అవి కొంత కాలం నికరమయిన కేంద్రం పరిధిలో వున్నాయి కాబట్టి వాటి వాటి పత్రాలు, కథనాలూ సరయిన సాక్ష్యాలతో దొరుకుతాయి. దక్కనుకి అలాంటి సౌకర్యమూ, సౌలభ్యమూ లేవు. గోల్కండ, విజయనగరం, బీదరు వున్నాయి కదా అంటే వున్నాయి. అవి  ఏ డిల్లీ నో, లండనో కాదు. చాలా మంది చరిత్ర కారులు దక్కను వైపు చూడకపోవడానికి అదొక కారణం. చాలా పని ఆధారాల సేకరణలో గడిచిపోతుంది. దొరికిన ఆధారాలు కూడా చరిత్ర అంతస్సూత్రాన్ని పట్టివ్వవు. అలాంటప్పుడు, జీవిత కథలు మంచి ప్రత్యామ్నాయం. ఈ దారి నాకు చాలా కష్టం మీద దొరికింది. లోపల్లోపల చాలా తన్నుకు లాడి ఈ దారిలో పడ్దాను. ఇది ఎంత వరకు సరయిన దారి అన్నది పాఠకుడి విచక్షణకి వదిలేస్తున్నాను. కాని, ఒక రచయితగా నాకు ఇది చాలా సంతృప్తినిచ్చింది. అసలు ఏది దక్కను అనేదే ఇంకా తేల్చుకోలేని స్థితిలో మనం వున్నప్పుడు దాని చరిత్ర రచన ఎలా వుంటుందో ఒకసారి మీరే ఆలోచించండి.

 

ఆలయ విధ్వంసాలు – వాద వివాదాలు

_ ఆలయ విధ్వంసాల మీద మీ రచనకి ఏమయినా వ్యతిరేకత వచ్చిందా?

నిజానికి నేను వూహించినంత వ్యతిరేకత రాలేదు. ఆలయ విధ్వంసాల వ్యవహారం చాలా వివాదాస్పదమయింది. మరీ ముఖ్యంగా ఇప్పుడు వున్న పరిస్థితుల్లో ఇలాంటి విషయాలు సున్నితంగా మారాయి. ఒక విధంగా అలాంటి విషయాల్లో కల్పించుకోకపోవడం మంచిదన్న ధోరణి పెరుగుతోంది. నా రచన ఆ నిశ్శబ్దాన్ని బద్దలు చేసింది. ఈ విషయంలో నన్ను విమర్శించిన వొకే వొక వ్యక్తి – కాన్రాడ్ ఎల్స్ ట్ . అతను యూరోపియన్ . హిందూ మతం పుచ్చుకున్నాడు. ఇండియాలో హిందూ మత చాదస్తుల కంటే నాలుగాకులు ఎక్కువే. అతనేదో రాశాడు. కాని, అది ఎవరినీ ఒప్పించలేకపోయింది. నన్ను అసలు ఒప్పించలేకపోయింది. అతనిలో వాదంలో పస లేదు. కారణం ఒక్కటే: అతనికి విశ్వాసాలు గట్టిగా వున్నాయేమో గాని, ఆధారాలు లేవు. నా రచనకి వ్యతిరేకంగా వాదించాలంటే నేను ఎటు వైపు నించి నరుక్కు వస్తున్నానో తెలియాలి. పూర్వ ఆధునిక కాలం గురించీ, ముస్లిం గతాన్ని గురించీ శోధించాలంటే, ముందు పర్షియన్ భాష తెలియాలి. అది అతనికి రాదు. సరే, భాష విషయం పక్కన పెట్టినా, అప్పటి చరిత్ర నడక తెలియాలి. అప్పటి మూలాధారాలు కొన్ని అర్ధం కావాలి. శాసనాలు చదవాలి. తారీఖులు దస్తావేజులు అర్ధం కావాలి. అసలు ఏది చరిత్రకి పనికొచ్చే సాహిత్యమో తెలియాలి. అవన్నీ వుంటాయని అతనికి తెలియదు. చాలా మందికి తెలియదు ఆ మాటకొస్తే! విశ్వాసాలు వేరు, చరిత్ర వేరు. పరిశోధన పూర్తిగా వేరు. ఆధారాలు లేకుండా పరిశోధన వుండదు. ముస్లింలు ఆలయాలు ధ్వంసం చేశారనీ రకరకాల అంకెలు కూడగట్టి మాట్లాడడం ఇప్పుడు మామూలుగా జరుగుతున్న పని. అందులోంచి వాస్తవం రాదు. వక్రీకరించిన వాస్తవమే వస్తుంది. అది చరిత్ర కాదు. ఆ కాలంలో అలా జరగలేదు అని చెప్పడానికి నేను చాలా శ్రమ పడాల్సి వచ్చింది. ఇంకా చాలా సమాచారం మిగిలిపోయింది. కాన్రడ్ లాంటి వాళ్లు చాలా మంది వుంటారు. అలాంటి వాదనలు నిలవవు.

అప్పటి దక్కను చరిత్ర పాఠాలు

 

          ఇప్పుడు మతం స్వభావం మారింది. అప్పటి దక్కను మత చరిత్ర నించి మనం తెలుసుకోవలసిన పాఠాలు ఏమన్నా వున్నాయా?

(పెద్దగా నవ్వుతూ) అఫ్సర్  , మీరు తేలిక ప్రశ్నలు మాత్రమే అడుగుతానని ఈ సంభాషణ మొదలు పెట్టారు! అవునా? కాని, నన్ను చాలా దూరం లాక్కు వెళ్లారు. ఈ ప్రశ్నకి జవాబు కష్టం అని మీకూ తెలుసు.  కాని, ఈ ప్రశ్న మీరు ఎందుకు అడిగారో నాకు తెలుసు. మీకు తెలుసు , గడియారాన్ని వెనక్కి తిప్పలేం. నిజానికి అది అసాధ్యం. చరిత్ర ఒక గడిచిపోయిన కాలం. దాన్ని పాఠ్య పుస్తకంగా చూడలేం. అప్పటి అనుభవాలు ఇప్పటి అనుభవాలు కాలేవు. మనం  బ్రిటిష్ వలస పాలన స్వభావాన్ని ఇంకా బాగా అవగాహన చేసుకోవాల్సి వుంది. వలస పాలన తర్వాత భారత దేశ చరిత్ర చాలా మారింది. అప్పటి దాకా, మతం స్వభావం వేరు, వలస పాలన తర్వాత మతం స్వభావం వేరు. కాని, పదహారు, పదిహేడు శతాబ్దాల దక్కను చాలా లౌకికమయిన వ్యవస్థ. అప్పటి హిందూ – ముస్లిం సంబంధాల్లో గొప్ప సహనం, సమన్వయం వున్నాయి. మీరు స్వయంగా ఆ రంగం మీద పరిశోధన చేస్తున్న వారే. కాబట్టి, నేను మరీ అంత వివరంలోకి వెళ్లను. అయితే, చరిత్ర కోణం నుంచి చూస్తే, నేను అప్పటి చట్ట సంబంధమయిన కొన్ని దస్తావేజులని చదువుతున్నాను. అసలు న్యాయ సంబంధమయిన వివాదాల్ని అప్పటి వ్యవస్థ ఎలా పరిష్కరించేదో ఆ దస్తావేజులు చదువుతూంటే అప్పటి సమాజం నా కళ్లకి కట్టినట్టు కనిపిస్తోంది. వలస పాలన వల్ల ఆ సహనాన్ని ఇప్పుడు భారత దేశం పోగొట్టుకుంది. మీరు తెలంగాణా, రాయల సీమ పల్లెల్లో చాలా ఫీల్డ్ వర్క్ చేశారు. ఆ పల్లెలు వలస పాలనకి ముందు ఎలా వున్నాయన్నది కూడా కొంత పరిశోధన చేసి వుంటారు. అసలు వలస పాలనకి ముందు ముస్లింల పాలనలో ఎక్కడయినా ఇస్లామిక్ చట్టం అమలు చేశారా? మీ పల్లె కథనాల్లో ఆ చాయలు ఎక్కడయినా వున్నాయా? నేను దస్తావేజులు చూశాను, మీరు జనంలోకి వెళ్లి చూశారు. అచ్చంగా మతం పేరుతో జనం ఏం చేశారో, చేస్తున్నారో చూశారు. వలస పాలన ఏం చేసిందో బాగా అర్ధం అయ్యి వుండాలి. ముస్లిం రాజులు ఇక్కడి జనంలో కలిసిపోయి, పాలించారు. దక్కను చరిత్ర నించి ఒక నమూనా ఏమయినా వుంటే, సహనం – సమన్వయం ఆ నమూనా.

మీకు తెలిసే వుండాలి, ఇప్పుడు తెలంగాణా గురించి చాలా ఆసక్తి పెరుగుతోంది. చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అంశాల మీద చాలా కృషి జరుగుతోంది. ఈ నేపధ్యంలో కొత్త పరిశోధకులకు మీ సలహా ఏమిటి?

– ముందు పర్షయన్ బాగా నేర్చుకోవాలి. ఇండియాలో ఈ భాష మీద అంత ఆసక్తి వున్నట్టు లేదు. అమెరికాలోనేమో, అది మధ్య ప్రాచ్య భాషగా ముద్ర పడింది. అసలు ఇరాన్ లో కంటే ఇండియాలో ఎక్కువ పర్షియన్ సాహిత్యం పుట్టింది. ఇరానీలు ఈ మాట వొప్పకోక పోయినా సరే, ఇది పచ్చి నిజం. 19 వ శతాబ్దంలో ఇరాన్ లో కంటే ఇండియాలోనే ఎక్కువ పర్షియన్ రచనలు వచ్చాయి. 20 వ శతాబ్దంలో అది తగ్గిపోయింది. విభజన తరవాత అసలు ఆ భాషకి ఉనికే లేకుండా పోయింది. అది పెద్ద విషాదం. ఇప్పుడు దక్కను పరిశోధకులు తక్షణం చెయ్యాల్సింది – పర్షియన్ పట్టుబట్టి నేర్చుకోవడం. తరవాత ముఫసిల్ వూళ్ళలోకి వెళ్లి, అన్ని రకాల రికార్డులూ గాలించడం. వూళ్లలో ఏం జరుగుతున్నదో చదవండి. నేను బెంగాల్ మీద పని చేసినప్పుడు అప్పుడు జాతీయ ఆర్కైవ్స్ అంటూ లేదు. ప్రతి జిల్లాకీ వెళ్లి రికార్డు రూముల దుమ్ము దులిపాను. ఆ పని దక్కనులో జరగాలి. చరిత్ర పరిశోధన అనగానే కలకత్తానో, లండనో పరిగెత్తాలనే వ్యామోహంలోంచి బయట పడాలి. అసలు చరిత్ర అంతా వూళ్లలో వుంది.

ఆ తర్వాత మా మాటలు చాలా సేపు వూళ్లలో ముస్లిం జీవనం, హిందూ – ముస్లిం సంబంధాల మీదకి మళ్లాయి. నా పరిశోధనలో నేను వుపయోగిస్తున్న అంశాలని గురించి ఆయన ఆసక్తి చూపించారు. మతవిధుల్లో వస్తున్న మార్పులు, ముస్లిం సమాజం మారుతున్న తీరు, ఇస్లామిక్ సాహిత్యం తెలుగులోకి విస్తారంగా అనువాదమయి, ప్రచారమవుతున్న విషయాల మీద చాలా సేపు ఆసక్తి కరమయిన చర్చ జరిగింది. అవి నేను వేరే సందర్భంలో ప్రస్తావిస్తాను.

ఈటన్ తో మాటల్ని నెమరేసుకుంటూ నేనూ, జాన్ బయటికి నడిచాం. ఈటన్ మాతో పాటు బయటికి నడిచారు. బయట బారెడు పొద్దెక్కినా ఆస్టిన్ సూర్యుడు ఇంకా బలహీనంగానే వున్నాడు. ఇంకా ఎండ చురుకెక్కలేదు అన్నాను నేను. పర్లేదు, నాకు మాత్రం ఈ సంభాషణతో చాలా చురుకెక్కింది అన్నాడు జాన్ . ముగ్గురమూ పెద్దగా నవ్వుకున్నాం, బయటి ఎండ మెరుపులా.

 

 

 

 

Published in: on ఫిబ్రవరి 24, 2009 at 6:15 సా.  Comments (1)  
Tags:

The URI to TrackBack this entry is: https://afsar2008.wordpress.com/2009/02/24/%e0%b0%b0%e0%b0%bf%e0%b0%9a%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%88%e0%b0%9f%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%92%e0%b0%95-%e0%b0%b8%e0%b0%82%e0%b0%ad%e0%b0%be%e0%b0%b7/trackback/

RSS feed for comments on this post.

One Commentవ్యాఖ్యానించండి

  1. డియర్ అఫ్సర్,జ్యోతి లో నీ వ్యాసం చూశాను.
    ‘ఈటన్‌’ నీ మాటన్‌ విన్నట్టే వున్నాడు తెలంగాణా చరిత్రకు ఈ వ్యాసం కొత్త వీసం తెచ్చి పెట్టింది.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: