వొక సాయంత్రపు దిగులు గూడు
లోపలి ప్రమిద
ఎప్పటి నించి వెలుగుతోందో
బహుశా చరిత్రకారుడు చెప్పగలడు
నా కంటే బాగా.
వాడికి ఇదొక అమర వీరుడి జ్ఞాపకం.
వొంటరితనం గురించి చరిత్రకారుడికింకా తెలిసినట్టు లేదు
దాని చరిత్ర నిండా దిగులు పుటలే.
వాటిని తారీఖుల ఎండిన రక్తంతో నింపేశాడులే.
2
కొన్ని సాయంత్రాలు
ఈ గూటిలోకి నడుస్తాను
వొక అక్షరమ్ముక్క సాయం పట్టుకొని.
నాలాంటి అక్షరాలు కొన్ని
అక్కడ గుడ్డి దీపాలు ముట్టిస్తూ
చీకటి గుహలోకి
కాసేపు మౌనంగా , కాసేపు నిర్మౌనంగా
కాసేపు మోహంగా,
కాసేపు నిర్మోహంగా.
3
ఈ సాయంత్రానికి
ఈ చలీ ఈ వానా కలగలిసి
ముంచుకొస్తున్న చీకటిలోకి
కాస్త నిబ్బరంగా నడిచుకుంటూ వెళ్ళడానికి
ఏదో వొక సాకు వెతుక్కుందాం
ప్రస్తుతానికి దాని పేరు కవిత్వం అనుకుందాం
4
ఈ గుహలోపలికి ఎవరు ఎలా
నడిచి వస్తారో తెలీదు
కొన్ని ఆశ్చర్యాలూ, కొన్ని విస్మయాలూ
కొన్ని సంతోషాల్లాంటి దిగుల్లూ
కొన్ని దిగుళ్ళ వంటి సంతోషాలూ
అనేక లిపులు భాష ఒక్కటే.
వొక వడ్రంగి మిత్రుడు
సుత్తీ శానా కొన్ని కర్ర ముక్కలూ
పద చిత్రాలుగా గీసి కవిత్వంలోకి
తనని తాను చెక్కుకుంటాడు.
వొకామె దారం వుండల్ని చేతులకి చుట్టుకొని
రంగులతో తన ప్రతిరూపాన్నే
అల్లుకుంటూ మధ్య మధ్య వాటికి
పదాల ఆసరా ఇస్తుంది.
వొక పరదేశీ
కళ్ళ వెనక తన నేలని కల కంటూ
తెగిన మాటలతో లోపలి సంభాషణని
ప్రకాశంగా ఆలోచిస్తాడు.
ఎవరి నేల ఏదో
ఎవరి పలుకు ఎక్కడిదో
ఈ దిగులు గూడుకొచ్చాక
అందరూ అశాంతి రెక్కల పిచ్చుకలు.
5
అమరుడా, వీరుడా
నీ కాలానికి నువ్వు వీరాధివీరుడివే
నిస్సంశయంగా.
కొత్త ఎల్లల మీద దస్తకతు చేసి
ఈ దిగంతం మీద వాలిన
ప్రతి పక్షికీ
ఇది వీరోచిత పోరాటమే.
కానీ
ఈ అమరత్వం ఈ వీరత్వం
ఎక్కడా చరిత్ర అవ్వదు
ఎప్పుడూ జ్ఞాపకం అవ్వదు.
6
ఆ మాటకొస్తే
అది జ్ఞాపకం అయ్యేంత వరకూ
వీళ్ళెవరూ మిగలరు
ఏ గుర్తులూ ఆ జ్ఞాపకాల్ని
కాల చెక్కిళ్ళ మీద చెక్కవు.
(మాంట్ మాత్రే ….మాడిసన్ లో వొక పాత కాలపు కఫే. పారిస్ లో స్వేచ్చ కోసం ప్రాణాలు ధార పోసిన అమరుల స్మారకం…ఇప్పుడు సాయంత్రాలు ఇక్కడ కవులు కలిసి కవిత్వాలు చదువుతారు. కబుర్లు చెప్పుకుంటారు)
Poem is really nice. It took me to a beutiful evening studded with tears. Not that I got every thing in it, but I am almost there. That is enough, I believe. The feeling it gives and the imprint it leaves is good and healthy.
-hrk