యెవరికెవరూ అక్కర్లేదు
చావుకి మాత్రమే అందరూ కావాలి
పాడలేని నీ గొంతునీ
కదనుతొక్కలేని నీ కాళ్ళనీ
అలల్ని వోడించే నీ శరీరాన్ని
వొక తెల్లదుప్పటి కప్పేసుకుని
మరణం కాసేపు
నీ యెదుట.
*
యెవరూ యెవర్నీ పట్టించుకోని
హత్యల్లోకీ, ఆత్మహత్యల్లోకీ
కాల్పుల్లోకీ, ఎదురు కాల్పుల్లోకీ
ఆకలిలోకి, పిడచకట్టిన గొంతుల చావుల్లోకీ
యెవరూ యెవరినీ పట్టించుకోని తనమే
అన్నిటికన్నా పెద్ద మరణం.
కాదంటావా, మైఖేల్!
*
యేవీ ఆ వానలు?
బతుకులోని ఆనందాన్ని
తనివి తీరా తడిపే అనురాగ ధారలు.
యేవీ ఆ సూర్య కిరణాల నులివెచ్చని పలకరింపులు?
ఈ క్షణానికి
అన్ని చీకట్లనీ గేలి చేసే అమ్మ పిలుపులు.
యేవీ నువ్వన్నావే
నీవీ మనవీ మనందరివీ
అనుకున్న ఆ సంతోషాల కేరింతలు?
రేపు కూడా మనదే అనుకునే
ధిక్కారపు అరుపులు..
అన్నీ తెల్లారు ఝాము
తట్టి వెళ్లిపోయే కలలే అంటావా, మైక్?
*
అమ్మ పాలూ, ఇతరుల నెత్తురూ
స్నేహితుడి కోపమూ, రంగు ద్వేషమూ
ఆకుల నవ్వూ, కత్తుల వికటాట్ట హాసమూ
విరగ్గాసిన చేను వయ్యారమూ
రక్త కురుక్షేత్రంలో నవవితంతువు శోకమూ
అన్నీ నువ్వే గుర్తు చేసావు
మరణం యెదురుగా నిలబడ్డప్పుడు
నువ్వు కచ్చితంగా పగలబడి నవ్వే వుంటావు
దాని కొత్త అమాయకపు పసి ముఖపు నటనలు చూసి చూసి.
అవునా, మైక్?
*
గాంధీలని ద్వేషించే
మార్టిన్ లని పరిహసించే
రూస్వెల్టుల్ని శంకించే
సంధి యుగం…
కప్పుకోను ఏ దుప్పటీ
ఎవరూ అరువివ్వని
గడ్డకట్టిన ద్వేషాల మంచు ఇగం.
నువ్వే నయం, మైక్
వొక పాటని
వొక పిచ్చి కోపాన్ని
రక్తం కక్కినట్టు కక్కి
వెళ్ళిపొయావు
మా గరుకు రాళ్ల చెంపల మీద.
*
నిజమే, మైక్
అందరూ కుళ్లిపోయారు
అందరూ వయసు మళ్ళిపోయారు
అందరూ గుండెల్ని ఖాళీ చేసి వెల్లిపోయారు
అందరూ
అందరూ
యెవరికెవరూ కాకుండా పోయారు.
అందరూ పోయారు
యెవరికెవరూ మిగల్లేదు
వొక అనాథ శవం నా నాగరికత
తన కాళ్ళ మీద తననే
మోసుకుపోతోంది కాటికి.
(ఇందులో చాలా లైన్లు మిఖెల్ జాక్సన్ పాటనించి తీసుకున్నాను.
యెవరి నించి తీసుకున్నమో వాళ్లని చచ్చినా క్షమించలేని ప్రతి వొక్కరికీ ఈ కవిత
మైఖేల్ పాటలోని పంక్తులు నేను చదువ లేదు.
కాని, మీ కవితా శిల్పం హృదయాన్ని కరిగించేలా ఉంది.
ప్రతి అక్షరం ” అఫ్సరం ” అయి భాసిల్లింది.
అభినందనలు !
చాలా సంతోషం , ఫణీంద్ర గారు:
మీ పద్యాలు, రామబ్రహ్మం గారి మాటలు చదివాక మీతో మాట్లాడితే బాగుంటుంది అనుకున్నాను. ఈ లోపు మీరే రాసారు. రామబ్రహ్మం గారు నాకు గురుతుల్యులు. వారి వ్యక్తిత్వం, రచనలూ నాకు ఎప్పటికీ ఆదర్శం. వారికి నా నమస్కారాలు తెలియజెయ్యండి.
ఇక పద్యం ఇప్పుడు నిన్నటి జ్ఞాపకం అయ్యింది నాకు. అదృష్టం కొద్దీ నాకు మంచి తెలుగు టీచర్లు దొరికారు చిన్నప్పటి నించీ.. వాళ్ళు ప్రాచీన కావ్యాలన్నీ చదివించారు దగ్గిరుండి. నా పద్య సాధన వాళ్ళ అనుకరణతోనే ఆగిపోయింది. కాని, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను, ఆ కావ్య రహస్య శోధనకి.
అఫ్సర్
kavitha Bagundandi.
Regards,
Himabindu