నల్లానల్లని నవ్వు
మెట్రో బస్ వెనకాతల
వొక కితకితల నల్ల సముద్రమేదో
అల లలుగా తుళ్ళి తుళ్ళి పడ్తుంది
ఏ ఇరుకు నగర శరీరాన్నో పగలగొట్టి
నవ్వుల వానలో ముంచెత్తాలని.
వెనక్కి తిరిగి చూస్తాను
నా లోపలి అతిమర్యాద తెల్లకణమేదో
వొక్క క్షణం మర్యాదగా జూలు విదిలించి
ఆ నల్ల సముద్రంకేసి,
అసయ్యపు చూపులు పొడుస్తుంది.
అలా అలలు అలలుగా యెగసి పడలేక
నవ్వుల తరగలతో ముంచెత్తుకోలేక
నవ్వలేని తనాన్ని దాచుకోలేక
లోపల ఎక్కడో గడి వేసుకుని
దూరానికి దొర్లిపోతాను.
మెట్రో బస్ వెనకాతల
వొక కితకితల నల్ల సముద్రమేదో
హోరు హోరుగా చిలిపి చిలిపిగా
వెంటాడ్తుంది నిద్రలోనూ
నిద్ర కళ్ళు వాలకుండా!
– అఫ్సర్

గులాబీలు, ఓ వేసవి చివర
ఏమవుతుంది,
ఈ ఆకులన్నీ
ఎరుపెక్కి, బంగారు రంగు దాల్చి
రాలిపోయాక?
ఏమవుతుంది,
ఎప్పుడూ పాడే ఆ పిట్టలు
ఇక పాడలేనప్పుడు?
ఏమవుతుంది,
బిరాన పోయే ఆ రెక్కలకు?
అవునంటావా,
ఇక్కడ ఎవరి స్వర్గం వాళ్ళదేనా?
అవునంటావా,
ఆ చీకటి ఆవలి నించి
ఎవరో వొకరు
మనల్నే పనిమాలా పిలుస్తారంటావా?
ఆ చెట్ల ఆవల
పిల్లలకి పాఠాలు చెబ్తూనే వుంటాయి నక్కలు
లోయలో దిలాసగా బతికేదెలాగో?
అవి ఎప్పుడూ కనుమరుగు కావు నిజానికి,
ఎప్పుడూ అక్కడే వుంటాయి
ప్రతి పొద్దూ విరిసే
వెలుగు మొగ్గల్లో
ప్రతి చీకట్లో
ఆకసాన నిలిచి.
ఆ కొండ కోనల వరసలో
సముద్రం వెంబడి
చివరి గులాబీలు
తీయని వాసనల తయారీలో తలమునకలు
లోకానికి ఏదయినా ఇద్దామన్న తపనతో.
ఇంకో జన్మంటూ వుంటే
నేను
వొక చెక్కు చెదరని ఈ సంతోషం కోసమే
అంతా గడిపేస్తా.
నేనో నక్కనవుతాను
వూగే కొమ్మల
చిన్ని చెట్టునవుతాను
ఆ గులాబీల తోటలో
వొక చిన్ని పూవునయినా దిగులు లేదు
భయమంటే ఏమిటో
తెలీదు కదా వాటికి.
కోరిక అంటే ఏమిటో
తెలీదు కదా వాటికి.
అసలు ఎందుకు అన్న ప్రశ్న
మనసులో పుట్టనే పుట్టదు కదా వాటికి.
పోనీ,
ఈ పూవు బతుకు ఎంత కాలం అన్న
దిగులు అసలు లేనే లేదు కదా వాటికి.
అసలు అలాంటెలాంటి
పిచ్చి ప్రశ్నా వాటి మనసుని తొలిచెయ్యదు కదా!
(మేరీ ఆలివర్ 2004 కవిత్వం “బ్లూ ఐరిస్ “లో “రోసెస్, లేట్ సమ్మర్” కి అనువాదం)

In the Middle of the Poem
The interrupted line sighs;
the suffocation of sudden silence;
someone pants at the rear,
fitfully. (మరింత…)

అఫ్సర్ కొత్త కవితా సంపుటి “ఊరి చివర”
మిత్రులకు:
కొత్త ఏడాది శుభాకాంక్షలు. ఈ ఏడాది/ ఈ దశాబ్ది మీ జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని కోరుకుంటున్నా.
నా కొత్త కవితా సంపుటి “ఊరి చివర” వెలువడింది. పాలపిట్ట బుక్స్ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఇప్పుడు విజయవాడలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో పాలపిట్ట ప్రచురణలు అందుబాటులో వున్నాయి.
ఈ కవితా సంపుటి మీద వివిధ సమీక్షలనూ, వ్యాఖ్యలనూ త్వరలో “అక్షరం ” లో చూడ వచ్చు.
మీ
అఫ్సర్
