రోజ్ రోటీ

 

1

 

వొక ఆకలి మెతుకూ వొక అదనపు లాభం క్రాస్ రోడ్డు మీద నిలబడి పోట్లాడుకుంటున్నాయ్. ఆకలి మెతుకులు లక్షన్నర. అదనపు లాభాలు పది. అయినా సరే, పది గదమాయిస్తుంది, దబాయిస్తుంది, ఘరానా చేస్తుంది. చరిత్రని వ్యాపారం చేస్తుంది. వ్యాపారాన్ని చరిత్ర చేస్తుంది.

ఆకలి మెతుకు

వొక తల్వార్ లాగా మెరిసి వొక నెత్తుటి చార కసిగా ఆక్రోశిస్తుంది.

నీకు అసందర్భంగా కనిపిస్తుందా, కవీ?!  

2

 

నాలుగు సగం చిక్కిపోయిన వూళ్ళు ఆరిపోతున్న చలి నెగడు ముందు కూర్చొని, కట్టెపుల్లల చేతుల్ని నిప్పుల మీదికి తోస్తున్నాయి, చెయ్యి కాల్తుందన్న భయం లేకుండా.

“ఎక్కడున్నాయి ఈ కాసిని కట్టెలయినా? పోనీ, ఈ నాలుగు చేతులయినా?” వొక ముసలి చెయ్యి నిట్టూరుస్తోంది, సగం ఖాళీ అయిన వూరు వైపు బలహీనంగా చూపు చాపి.

“వూరు సగం ఇళ్ళు, సగం వల్లకాడు. బతికి వున్న వాళ్ళు సగం శవాలు” ఇంకో గొంతు పిడచకట్టిన స్వరంతో మూల్గింది.

ఆ మూలుగు వినపడ్డదా, నగర కథకుడా! అద్భుత మాంత్రికుడా!

3

 

నా అక్షరాలు ఇసుకలో దూదుం పుల్లలు. చొక్కాలు రాల్చుకున్న పిల్లలు. నిద్రలో ఆకలి కేకలు. వొక వూరి నించి ఇంకో వూరికి పారుతున్న ఎండు కడుపులు. వొట్టిపోయిన నదులు. పక్క నించే బల్లెంలా దూసుకుపోయే పరాయి నీటి ధారలు. ఇంకేం లెక్కలు తీస్తావ్, నా ఎండు డొక్కల స్కేళ్ళ మీద.

చడ్డీ నించీ చుక్కల లెక్క నాది. ఇంకేం చెప్పమంటావ్, అధునాతన లెక్కల బుర్ర కథకుడా?!

4

 

నువ్వు చెప్పు, నేను వింటా, నీ బాంచ!  వినీ వినీ నా చెవుల్లో పుట్టలు మొలిచినయిలే! నువ్వు గొంతు సవరించుకునే లోగా నా వొళ్ళు వొంగి దండమయిపోయిందిలే!  ఇన్నాళ్ళూ. నిన్ను పీరీలాగా మోశానా, ఇప్పుడు నా కడుపు కర్బలా అయిపోయిందిలే!

చరిత్ర చొక్కాని  తిరగేసి తొడుక్కుంటున్నా, నన్ను దాచేసిన చిరుగు కంతల్లోంచి సూర్యుణ్ణి కంటున్నా.  

కలల కళల మాయా దర్పణమా, కాసేపు పగిలిపో!

5

రోజ్ రోటీ నా అద్దం. దాంట్లోంచి రాస్తున్నా కొత్త చరిత్ర.

*

(డల్లస్-టెక్సస్ తెలంగాణా సదస్సులో కొన్ని పల్లె బతుకు కథనాలు విన్నాక)

Published in: on జూన్ 2, 2010 at 12:40 ఉద.  Comments (1)  

The URI to TrackBack this entry is: https://afsar2008.wordpress.com/2010/06/02/%e0%b0%b0%e0%b1%8b%e0%b0%9c%e0%b1%8d-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%9f%e0%b1%80/trackback/

RSS feed for comments on this post.

One Commentవ్యాఖ్యానించండి

 1. డియర్ AFSAR!

  మీ కవితలు ఇదివరకు పత్రికల్లో కొన్ని చదివాను.

  ఇప్పుడు—ముఖ్యం గా “నా అక్షరాలు (వెన్నెల్లో ఆడుకొనే ఆడపిల్లలు కాదు!) ఇసుకలో………………పిల్లలు!”!!!!????

  వారెవా!

  మీది “తెలంగాణా” బాధ అవునో, కాదో నాకు తెలీదు—కానీ, సామాన్యుల బాధ! అదే ప్రపంచం బాధ! శ్రీశ్రీ బాధ!

  కీపిటప్!


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

<span>%d</span> bloggers like this: