‘ఆ మైదానంలోకి వెళ్లిపోండి. వెనక్కి తిరిగి చూడకండి. తిన్నగా వెళ్లండి సూర్యుడి కిరణంలాగా’
గత కొన్ని దశాబ్దాలుగా ఇదే వాక్యాన్ని పదేపదే వేరేవేరే సందర్భాల్లో చెబ్తూవచ్చిన తీవ్ర స్వరం హీరాలాల్ మోరియాది. నాకు సాహిత్య ఊహలు తెలుస్తూ, అర్థమవుతూ వచ్చిన పదేళ్ళ ప్రాయంనుంచీ ఇప్పటివరకూ మోరియాని అనేక సందర్భాల్లో చూశాను, విన్నాను. మేం అప్పుడు పల్లెనుంచి పట్నానికి వచ్చిన రోజులు. ఒక రోజు సాయంత్రం ఇంటికి తెల్లఖద్దరు బట్టల్లో మంచి మల్లెపువ్వులా ఆయన నడిచివచ్చారు. ఆ సాయంత్రం ఆయనా, నాన్నగారు (కౌముది) ప్రపంచ సాహిత్యాన్నంతా ఆగమేఘాల మీద సందర్శించారు. ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు… భాషల అడ్డుగోడల్లేని సాహిత్య సంభాషణ. ఆ రోజు రాత్రి ఆయన వెళ్ళిపోతూ ‘అఫ్సర్ బేటా’ అని నావైపు తిరిగి పైన చెప్పిన ఒకే ఒక్క పంక్తి చెప్పారు. అదేమాట ఆయన రెండేళ్ళ క్రితం నేను మాడిసన్ నుంచి వచ్చినపుడు (2004) మరోసారి మళ్ళీ చెప్పారు. అది ఆయన్నించి నేను విన్న మొదటి, చివరి మాట కూడా! (మరింత…)