“సంపూర్ణ అనే సంస్కృతం పదం వాడను కాని, పూర్తి జీవితం ఎలా వుంటుందో నాకు ఇంకా తెలియదు, తెలుస్తుందన్న నమ్మకమూ లేదు. కాని, “యాది” చదివాక ఆ పూర్తి జీవితంలోని కనీసం ఒక కోణం నాకు తెలిసింది. జీవితం ఒక పదిలమయిన యాది ఎలా అవుతుందో తెలిసింది. నలుగురు మనుషుల మధ్య జీవితం పండగ అవుతుందని తెలిసింది. “యాది” నేను ఎప్పుడూ తలుచుకునే పుస్తకం”
ఈ మాటలు నావి కావు.
తెలుగు సాహిత్యానికి – ఆ మాటకొస్తే సాహిత్యానికే – పూర్తిగా కొత్త వాడయిన బ్రైస్ రాబిన్సన్ అనే వొక అమెరికన్ విద్యార్థి సదాశివ గారి “యాది” లో కొన్ని భాగాలు చదివి రాసిన వ్యాఖ్య.
టెక్సస్ యూనివర్సిటీలో రెండేళ్ళ పాటు తెలుగు నేర్చుకున్న బ్రైస్ “ఇప్పటి దాకా మా చేత మంచి తెలుగు కథలు చదివించారు. ఇప్పుడు కొన్ని జీవిత కథలు – ఆత్మకథలు- చదివించండి” అని అడిగినప్పుడు సదాశివ “యాది”, తిరుమల రామచంద్ర “హంపీ నుంచి హరప్పా దాకా”, శ్రీపాద “అనుభవాలూ-జ్ఞాపకాలూను” నించి కొన్ని భాగాలు చదివించాను. ఈ విధంగా వాటిని చదివిన వాళ్లలో అయిదుగురు అమెరికన్ విద్యార్ధులు, పదమూడు మంది అమెరికన్-భారతీయ విద్యార్థులలో బ్రైస్ వొకడు. అందరికీ బాగా నచ్చిన పుస్తకం “యాది”. రమ్య అనే మరో అమెరికన్ తెలుగమ్మాయి ఇప్పటికీ ఫోన్ చేస్తే, “యాది గుర్తొస్తుంది. అప్పుడప్పుడూ చదువుతున్నాను. సదాశివ గారి కొత్త పుస్తకాలు వుంటే చెప్పండి” అంటుంది.
కొత్త పాఠకులు ఎలా తయారవుతారన్నది ఎప్పటికీ పెద్ద ప్రశ్నే. మరీ ముఖ్యంగా, వ్యాపార విలువలు చుట్టుముట్టిన కాలంలో నిజమయిన సాహిత్యానికి స్థానం వుందా , కొత్త తరంలో పాఠకులు తయారవుతున్నారా అన్నవీ ప్రశ్నలే! ఈ మధ్య చాలా మంది సాహిత్య మిత్రులు “సాహిత్య సభలకి వచ్చే వాళ్ళలో అందరూ నలభై దాటిన వాళ్ళే. అసలు పాఠకులు అంటూ కొత్త తరంలో వుండడం లేదు. ఈ సంగతులు మాట్లాడే వాళ్ళు ఎక్కువ నలభై ప్లస్ వాళ్ళే” అనడం విన్నాను. పాతిక-ముప్ఫై అయిదు ఏళ్ళ వాళ్ళలో పాఠకులు తక్కువ అనీ విన్నాను.
అలాంటి సమస్య అమెరికాలో కూడా లేకపోలేదు కాని, భాషలకి అమెరికన్ విశ్వ విద్యాలయాల్లో వున్న ప్రాధాన్యం వల్ల, రాయడం అనే ప్రక్రియ మీద పెరుగుతున్న శ్రద్ధ వల్ల కొత్త తరంలో పాఠకులు తగ్గే ప్రమాదం లేదు. ” యాది చదివాక రాయడం/ చదవడం అంటే నాకు ఇంకాస్త ప్రేమ పుట్టింది. తెలుగులో రాయడం ఇంకా బాగా నేర్చుకోవాలి.” అన్నాడు ఆస్టిన్ సీర్స్ అనే విద్యార్థి వొక సారి క్లాసులో.
ఆస్టిన్, బ్రైస్ లకి తెలుగు ‘తల్లి భాష’ కాదు,కాని రమ్య కరీం నగర్ లో పుట్టి, టెక్సస్ లో పెరిగిన అమ్మాయి. తెలుగులో “దోస్తు” “జర” “పరేషాన్” లాంటి కొన్ని మాటలు తప్ప అన్నీ మరచిపోయింది. “నేను జరంత తెలంగాణ తెలుగు చెప్త. అందరు నవ్వుతరు” అనేది.తెలుగు మాట్లాడానికి జంకేది. సదాశివ గారి “తెలంగాణా వాళ్లకి తెలుగు రాదా?” అన్న వ్యాసం చదివాక రమ్యలో తన భాష పట్ల మమకారం పెరిగింది. “ఎవరేమనుకున్నా గిట్లనే చెప్త” అని, హాయిగా మాట్లాడ్డం మొదలు పెట్టింది. “ఏ పుస్తకం చదివాక అయినా భాష మీద ప్రేమ పుట్టాలి.” అనే వాడు ఆస్టిన్. ఈ ప్రేమ ఎంత దూరం వెళ్ళిందంటే, వాళ్ళు టెక్సస్ లో చదువుకున్నంత కాలం నేను చెప్పిన ప్రతి సాహిత్యం కోర్సులోనూ చేరారు. “సాహిత్యం ఇప్పుడు మా జీవితాల్లో వొక భాగం.” అంటాడు ఆస్టిన్ ఇప్పటికీ. అలాంటి ప్రేమని మన ఆలోచనల్లోకి వొంపడం కన్నా సాహిత్యం చెయ్యాల్సిన గొప్ప పని ఇంకోటి ఏముంది?
*
సదాశివ గారి గురించి కొత్త తరం అంటున్న ఈ మాటలు వింటున్నప్పుడు నాకు నా బడి జీవితం గుర్తు వచ్చింది. నేను బడిలో ఏ నాడూ తెలుగు మీడియం చదవ లేదు. మొదట తప్పని సరయి ఉర్దూ, తరవాత కాన్వెంటు ఇంగ్లీషు రాపిడి…ఇంగ్లీషు కవిత్వం మీది వ్యామోహం…షెల్లీ, కీట్సులని బట్టీ కొట్టి వాటిని ఎడపెడా అనుకరించిన ఇంటర్ బతుకూ…ఈ స్థితిలో మా ఇంటికి వొక పుస్తకం చేరింది. దాని పేరు “ఫారసీ కవుల ప్రసక్తి.” ఆ పుస్తకం లోపలి పేజీలో వొక కనికట్టు లాంటి అక్షరం. నీలి సిరాలో ఎప్పటికీ మరచిపోలేని అంధమయిన దస్తూరి. అది సదాశివ గారి సంతకం.
బ్రైస్, ఆస్టిన్, రమ్య లాంటి వాళ్లకి వచ్చే సరికి సదాశివ గారి కొన్ని పుస్తకాలు అయినా అందుబాటులోకి వచ్చాయి. పుస్తకాల అందుబాటు విషయానికి వస్తే, ఈ తరం చాలా అదృష్టం చేసుకుందని చెప్పి తీరాలి. అప్పుడు మా ఇంట్లో సదాశివ గారి “ఫారసీ కవుల ప్రసక్తి ” తో పాటు, ఆయన అనువాదం చేసిన “ఉర్దూ సాహిత్య చరిత్ర ” మాత్రమే వుండేది. అవి రెండూ నాకు కనీసం వొక రెండేళ్ళ పాటు మెదడుకి మంచి మేత పెట్టాయి. కాని, “ఫారసీ కవుల ప్రసక్తి” మాత్రం ఇప్పటికీ నెలకి వొక సారి అయినా చదువుతూ వుంటాను. దాదాపు పాతికేళ్ళ పైబడి నా పాఠక హృదయంలో పీట వేసుకున్న ఈ పుస్తకాల గురించి నేను అనాలనుకున్న మాటలు ఈ పరదేశీయులు అంటూ వుంటే – ఒక పఠనానుభవాన్ని చక్కగా మాటల్లోకి వొదిగించిన వాళ్ళ వ్యక్తీ కరణ శక్తికి ముచ్చటేసింది. కొత్త తరం వాళ్ళు పుస్తకాల గురించి ఏం మాట్లాడుకుంటారా అని ఆసక్తిగా వెతుక్కుంటాను నేను. కొన్ని మాటలు విపరీతమయిన వాడుక వల్ల మన దగ్గిర అరిగిపోతాయి. కాని, కొత్త వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనకి కొత్త పదాలు దొరుకుతాయి. కొత్త పదాలు అంటే కొత్త భావనలు కూడా.
“రక్తస్పర్శ” కవిత్వంలో కొత్త ప్రతీకల్నీ, పదచిత్రాల్నీ తలుచుకున్నప్పుడల్లా- సీతారాం అనే వాడు – ” నీ కవిత్వంలో ఉర్దూ, ఫారసీలు నీకు తెలీకుండానే వచ్చేశాయేమో?!”అని! ఆ కవిత్వం ఆ కాలంలో ఎందుకు అంత కొత్తగా అనిపించిందో ఇప్పటికీ పూర్తిగా తెలీదు. కాని, సీతారాం చాలా పాసింగ్ గా అన్న ఆ మాట ఆ కవిత్వంలోకి ఒక రహస్య ద్వారం కావచ్చు. పాఠకుడిగా మన లోపల స్థిరపడి వున్న కొంత మంది కవుల నించి తప్పించుకోవడం అంత తేలిక కాదు. సదాశివ గారు కవి కాదు, కాని, అనేక మంది ఉర్దూ, ఫారసీ కవులని మన మనసుల్లోకి తీసుకువచ్చిన వచన వాహిక. ఆయన అందించిన తీగ పుచ్చుకొని, ఆ ఉర్దూ, ఫారసీ డొంకల్ని కదిలిస్తూ మనలో కొందరి కొంత ప్రయాణం సాగింది. ఇక్బాల్ చంద్ కవిత్వంలో కూడా ఈ తీగల సున్నితమయిన పరిమళం, తీయని గాయాల నెత్తుటి గీతలూ వుంటాయి. అలా సాగి సాగి. సదాశివ గారి పుణ్యమా అని- ఇప్పుడు హఫీజ్ దగ్గిర దిగాలుగా కూలబడి పోయాను నా మటుకు నేను. ఎప్పుడో పదమూడో శతాబ్దం నాటి ఈ పురాకవి ఇప్పుడీ క్షణాన నన్ను ఎంత క్షోభ పెడ్తున్నాడో మాటల్లో చెప్పలేను.
“ఆసవ పాత్ర యట్టడుగు నందొక చుక్కయె నిల్చెనేని తె
మ్మా సఖి! దుమ్ము చల్లెద నిహమ్ము పరమ్మును రెంటి పైన
అన్న వాడిని, ఆ పలుకులోని వాడినీ తెలియచెప్పిన సదాశివ గారికి ‘ఖదంబోసి’ చెప్పకుండా వుండడం సాధ్యమా?
*
సదాశివ గారి కృషి కేవలం భాషకి సంబంధించింది మాత్రమే అనుకుంటే పొరపాటు. ఆయనకి ఉర్దూ ఫారసీకాల మీద వున్న ప్రేమని కొంచెం సేపు పక్కన బెట్టి, వొక దీర్ఘ కాలిక ప్రసవ వేదనలా ఆయన అరవయేళ్ళుగా చేస్తున్న ఈ పని మొదలయ్యింది 1950 ల ప్రాంతంలో- ఇప్పుడు ఈ మాట కొంత మందికి కోపం తెప్పించవచ్చు కానీ, తెలుగు భాష ప్రాతిపదికగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం వల్ల తెలుగు బాగా నష్టపోయింది. అందుకే, సదాశివ గారు ఎక్కడో రాసినట్టు గుర్తు – “నవంబరు వొకటి తెలుగుకి బ్లాక్ డే” అని! అది ఎంత నిజమో ఈపాటికి మనకి అనుభవం అయ్యి వుండాలి. రాజకీయంగా కంటే, సాంస్కృతికంగా ఇది పెద్ద కుదుపు. తెలుగుకీ ఉర్దూకీ వున్న బంధం ఇక్కడిన్ నించి తెగిపోయింది. ఇప్పుడు ఉర్దూ రాని/చదవలేని ముస్లిం తరం రావడానికీ, ఉర్దూ అనేది పరభాష కావడానికీ విష బీజం పడిన కాలం అది. రాజకీయాలు ఎక్కించిన ఈ విషాన్ని తొలగించి, మన వొంట్లో మన అసలు రక్తం ఎక్కించడానికి చాలా నిశ్శబ్దంగా కలం పట్టి పోరాడుతున్న యోధుడు సదాశివ గారు.
ఈ రక్తం అన్ని జాతుల ప్రజలది. అన్ని భాషల కలయిక. దేశ దేశాల నించి వచ్చిన వాళ్ళు ఉర్దూని వొక ఆసరగా చేసుకుని అల్లుకున్న మల్లె తీగ. అలాంటి ఉర్దూ తరవాత తరవాత ముస్లిం ల భాషగా మాత్రమే మిగిలే దుస్థితి ఎలా ఏర్పడిందో సుతిమెత్తగా గుర్తు చేస్తూ వస్తున్న బుద్ధిజీవి సదాశివ. 1948 తరవాత నించి 1950 మధ్య కాలంలో తెలుగు-ఉర్దూ భాషల మధ్య అప్పటి దాకా కట్టిన మంచితనపు వంతెనలన్నీ కుప్పకూలిపోయాయి. ఈ సాంస్కృతిక విషాదాన్ని రికార్డు చేసే ఆధారాల కోసం నేను గత కొంత కాలంగా వెతుకుతున్నాను. అలా దొరికిన వాళ్ళలో – కవిరాజ మూర్తి, నెల్లూరి కేశవ స్వామితో పాటు సదాశివ గారు వొకరు. ఈ వైపు ఇంకా నా పని కొన సాగుతూనే వుంది. అయితే,మిగతా వారి కృషికీ, సదాశివ గారి కృషికీ వొక తేడా వుంది. మిగిలిన వారు సృజనాతంక రంగాలలో పనిచేసిన వారు. భాషా సాంస్కృతిక చరిత్రకి, ఆనుభవిక కోణాన్ని జత చేసి, తన చుట్టూరా చూసిన/అనుభవించిన కాలాన్ని చరిత్ర చేస్తున్న అరుదయిన వ్యక్తి సదాశివ.
ఇంటి ముందో వెనకో ఏదో వొక పువ్వు పూసే చెట్టు వుంటే, ఎంత బాగుంటుందో! సదాశివ గారు మన మధ్య వుండడం అంత పరిమళభరితమయిన అనుభూతి.
నా అదృష్టం బాగుండి, ఇప్పటి దాకా – చింతకాని నించి ఆస్టిన్ దాకా- ఏదో వొక చెట్టు మా ఇంటి ముందో వెనకో వుంది. పొద్దున్నే లేచి, చాయ్ చప్పరిస్తూ ఆ చెట్టు కింద నిలబడి అవి రాల్చే పూల స్పర్శలో పొద్దు చురుకెక్కుతుంది. ఈ పరదేశపు చెట్టు చుట్టూ పరిమళం వేప పూత పరిమళం లాగా వుంటుంది. అది నిజంగానే ఆ వేప పూత పరిమళమో, లేక నేను చేసుకున్న పరిమళానువాదమో/ఇచ్చానువాదమో తెలీదు. కాని, ఈ చెట్టు నా చెట్టే, ఈ పరిమళం ఆ వేప చెట్టుదే అనుకునేంత బలంగా నా పొద్దులో కలసిపోయింది. సదాశివ గారి ఉర్దూ, ఫారసీ లోకం కూడా అలానే మన లోకం అయిపోయింది ఇప్పుడు. ఆ రెండు భాషలకి మనం గత కొంత కాలంగా ఆపాదిస్తూ వచ్చిన పరాయీ భావనని చెదరగొట్టే ప్రభావం ఆయనది.
ఈ పొద్దు పరిమళ విహీనం కాక ముందే, వొక్క సారి ఆయన్ని పలకరించి వద్దామా?! ఆయన మన కోసం వెతికి పట్టుకొచ్చిన పూల వాసనల యాది కొంత అయినా దాచుకుందామా?
*
Nenu yadi chadavalanukuntunnanu. Dayachesi yadi pustakam yokka publishers, adi dorike book shop vivaralu telupagalaru.
Sri Afsar, I searched the net and found Review on Sri Sadasiva writer in online edition of HIndu newspaper published on 23-10-2009.
I thank you for introducing a great Telugu writer.I am sorry I didnot know any of his works before.
its a wonderful intro
i feel too ashamed to say that i hear this name for the first time.
i will try to probe him
thank you
bollojubaba
wonderful.